
చెన్నై: అమీతుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచి నిలిచింది. CSK ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా.. అంటే నూటికి 99 శాతం ఆవిరి అయిపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి ఛేదించింది. 5 వికెట్ల తేడాతో చెన్నై జట్టును చెపాక్లో ఓడించింది.
ఫస్ట్ టైం చెన్నై జట్టును చెపాక్లో ఓడించి SRH చరిత్ర సృష్టించింది. ఇషాన్ కిషన్ 44 పరుగులతో రాణించడంతో సన్ రైజర్స్ విజయం సాధ్యమైంది. చివర్లో కమిందు మెండిస్ 32 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగులు కూడా SRH విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి. కమిందు మెండిస్ ను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. 42 పరుగులు చేసి SRH బౌలర్లను టెన్షన్ పెట్టిన చెన్నై బ్యాటర్ బ్రెవిస్ క్యాచ్ పట్టి సన్ రైజర్స్ జట్టుకు పెద్ద గండాన్నే తప్పించాడు.
ఫీల్డింగ్లోనే కాదు.. 5 వికెట్లు కోల్పోయి SRH కష్టాల్లో ఉన్న సమయంలో 32 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయానికి బాటలు వేశాడు. ఇక.. SRH బ్యాటింగ్ విషయానికొస్తే.. అభిషేక్ శర్మ డకౌట్, ట్రావిస్ హెడ్ 19 పరుగులు, ఇషాన్ కిషన్ 44 పరుగులు, క్లాసెన్ 7 పరుగులు, అనికేత్ వర్మ 19 పరుగులు, మెండిస్ 32 పరుగులు నాటౌట్, నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజాకు తలో వికెట్ దక్కింది.
ఇక చెన్నై బ్యాటింగ్ విషయానికొస్తే.. SRH కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే.. షమీ బౌలింగ్లో తొలి బంతికే చెన్నై ఓపెనర్ షేక్ రషీద్ స్లిప్లో అభిషేక్ శర్మకు క్యాచ్గా దొరికిపోయి వెనుదిరిగాడు. ఆ తర్వాత 39 పరుగుల దగ్గర శామ్ కరన్ వికెట్ కోల్పోయిన చెన్నై 47 పరుగుల దగ్గర మూడో వికెట్ కోల్పోయింది.
ఆయుష్ మాత్రే 6 ఫోర్లతో 19 బంతుల్లోనే 30 పరుగుల చేసి దూకుడుగా ఆడాడు. కమ్మిన్స్ బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. బ్రెవిస్ 4 సిక్స్లు, ఒక ఫోర్ తో పాతిక బంతుల్లోనే 42 పరుగులతో సన్ రైజర్స్ బౌలర్లను కంగారుపెట్టేశాడు. అయితే.. బ్రెవిస్ స్పీడ్ కు SRH బౌలర్ హర్షల్ పటేల్ అడ్డుకట్ట వేశాడు.
హర్షల్ పటేల్ బౌలింగ్లో షాట్ కోసం యత్నించి బ్రెవిస్ కొట్టిన బంతిని కమిందు మెండిస్ అందరూ అవాక్కయ్యేలా క్యాచ్ పట్టాడు. దీంతో.. బ్రెవిస్ 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్కు వెళ్లిపోయాడు. శామ్ కరన్ 9 పరుగులు, శివం దూబే 12 పరుగులు, దీపక్ హుడా 22 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ పూర్తిగా నిరాశపరిచాడు. 10 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయి వెళ్లిపోయాడు.
అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ 2 పరుగులు, ఖలీల్ అహ్మద్ (నాటౌట్) ఒక పరుగు చేయడంతో చెన్నై జట్టు 154 పరుగులు చేయగలిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. పాట్ కమ్మిన్స్ (4 ఓవర్లు), జయదేవ్ ఉనద్కట్ (2.5 ఓవర్లు) చెరో 21 పరుగులు ఇచ్చి చెరో రెండు వికెట్లు తీసి రాణించారు. షమీ, కమిందు మెండిస్కు తలో వికెట్ దక్కింది. మొత్తానికి డూ Or డై మ్యాచ్లో చెన్నైపై గెలిచి సన్ రైజర్స్ జట్టు ఇంకా టోర్నీలోనే ఉన్నామని, ప్లే ఆఫ్ ఆశలు వదులుకోలేదని SRH అభిమానులకు స్పష్టమైన సంకేతాలిచ్చింది.
A milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪
— IndianPremierLeague (@IPL) April 25, 2025
Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP