- రూ. 45 లక్షలు కాజేసిన సీఎస్‌పీ నిర్వాహకురాలు
- ఐకేపీ, బ్యాంకు సిబ్బందిపై అనుమానాలు
పోతంగల్(కోటగిరి),వెలుగు: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూరులో రూ.45 లక్షల డ్వాక్రా సంఘాల సొమ్మును సీఎస్‌పీ నిర్వాహకురాలు స్వాహా చేసింది. కల్లూరు గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల సభ్యులు స్థానిక కెనరా బ్యాంకులో తమ లావాదేవీలు కొనసాగిస్తుంటారు. ఈ గ్రామానికి చెందిన సంధ్య కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్ పీ) ను ఏర్పాటు చేసుకుంది. దీంతో మహిళా సంఘాల సభ్యులు డ్వాక్రా సంఘ సభ్యులు పొదుపు, లోన్ కు సంబంధించిన లావాదేవీలు సీఎస్‌పీలోనే చేసేవారు.
ఏడాదిగా 38 డ్వాక్రా సంఘాల సభ్యులు కట్టే పొదుపు, లోన్లకు చెందిన రూ.45 లక్షలు బ్యాంకుకు కట్టకుండా సీఎస్‌పీ నిర్వాహకురాలు తన బంధువుల ఖాతాల్లో వేసుకుంది. లోన్ పూర్తయిందని తమకు కొత్త లోన్ కావాలని బ్యాంకుకు వెళ్లిన ఓ సంఘం సభ్యులు తమ లోన్ అకౌంట్ స్టేట్ మెంట్ చూడగా వారి లోన్ ఇంకా పూర్తి కాలేదని బ్యాంకు వారు చెప్పడంతో అవాక్కయ్యారు. డ్వాక్రా సంఘం సభ్యులు వివరాలు అడగ్గా సీఎస్‌పీ నిర్వాహకురాలి వద్దే డబ్బులు పక్కదారి పట్టాయని తేలింది. దీంతో గ్రామంలోని డ్వాక్రా మహిళలంతా సీఎస్‌పీ నిర్వాహకురాలిని ప్రశ్నించారు.
దీంతో డబ్బులు తానే అవసరాలకు వాడుకున్నానని నిర్వాహకురాలు చెప్పింది. తనకు కొంత సమయం ఇస్తే సభ్యుల డబ్బులు బ్యాంకుకు చెల్లిస్తానని గ్రామ పెద్దలు, ఐకేపీ సిబ్బంది సమక్షంలో ఒప్పుకుంది. డ్వాక్రా మహిళా సంఘాల లావాదేవీలు ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఇద్దరు ఐకేపీ సీఏలు, ఒక సీసీ ఉన్నా డబ్బులు పక్కదారి పడుతుంటే పసిగట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు సిబ్బంది కూడా తాము డబ్బులు చెల్లించేందుకు బ్యాంకుకు వెళితే సీఎస్‌పీలోనే డబ్బులు కట్టాలని పంపేవారని కొందరు సభ్యులు చెబుతున్నారు.