
- మహారాష్ట్ర నుంచి భోరజ్ వరకు
- 33 కిలోమీటర్ల రోడ్డు
ఆదిలాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర నుంచి బోరజ్ వరకు నిర్మించనున్న హైవే 353 బి విస్తరణకు అక్టోబర్లో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా రోడ్డు పనులు చేపట్టేందుకు అధికారులు టెండర్లు ఆహ్వానించడంతో జాతీయ రహదారి నిర్మాణంలో కదలిక వచ్చింది. మహారాష్ట్ర నుంచి బేల, జైనథ్ మీదుగా భోరజ్ నేషనల్ హైవే 44 వరకు ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. హైవే నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రహదారిని 7 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు పెంచనున్నారు. ఆదిలాబాద్ -బేల సెక్షన్‌లోని డబుల్ లేన్ విస్తరణ వల్ల మహారాష్ట్ర, తెలంగాణకు రవాణా సదుపాయాలతో పాటు ఆర్థిక సంబంధాలు మెరుగుపడనున్నాయి. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ వరకు 353 బి నేషనల్ హైవే 141 కిలోమీటర్లు ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో 33 కిలోమీటర్లు విస్తరణ చేయనున్నారు.
రూ. 490.92 కోట్లతో విస్తరణ..
ఈ రోడ్డు డబుల్ లేన్ అయినప్పటికీ దేశంలో నేషనల్ హైవేల విస్తరణ, అనుసంధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఆర్అండ్ బీ కింద ఉన్న ఆ రోడ్డును హైవే కింద మార్చింది. మహారాష్ట్ర నుంచి బేల మీదుగా జైనథ్ మీదుగా భోరజ్ వరకు విస్తరణ కోసం భరతమాల పథకం కింద రూ. 490.92 కోట్లు మంజూరు చేసింది. హైలెవల్ బ్రిడ్జీల నిర్మాణం, సర్వీస్ రోడ్లు, భూసేకరణ కోసం ఈ నిధులు వెచ్చించనున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసి డిటైల్ రిపోర్టును కేంద్రానికి అందజేయగా తాజాగా పనుల కోసం హైవే అధికారులు టెండర్లను ఆహ్వానించారు. రెండు నెలల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మహారాష్ట్ర నుంచి బేల, జైనథ్ బోరజ్ నేషనల్ హైవే 44 వరకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు నడుస్తాయి. ప్రయాణికులకు సంబంధించిన వాటితో పాటు నిత్యం వ్యాపారాలకు సంబంధించిన లారీలు, ట్రావెల్స్ రాకపోకలు చేస్తాయి. ముఖ్యంగా సిమెంట్ లారీలు, బొగ్గు, సరుకులు తరలించే లారీలు, వంటివి ఈ రోడ్డు మార్గం గుండా మన జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు నిత్యం వెళ్తుంటాయి. మరోపక్క ఇటీవల జైనథ్ మండలం తర్నం బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు ఇతర రోడ్డు మార్గం ద్వారా మళ్లించారు. ఇదే ప్రాంతంలో కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు రూ. 20 ఖర్చు చేయనున్నారు.
భూసేకరణకు అడ్డంకులు..
భూ సేకరణ పనులకు ఆదిలోనే అడ్డంకులు వస్తున్నాయి. పలు గ్రామాల ప్రజలు రోడ్డ విస్తరణకు తమ వ్యవసాయ భూములు ఇవ్వబోమంటూ స్పష్టం చేస్తున్నారు. మండల కేంద్రం నుంచి విస్తరణ చేపట్టాలని, వ్యాపార, వాణిజ్య సముదాయాలకు ఇచ్చే ప్రాధాన్యత రైతులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. బైపాస్
నిర్మాణం కోసం రైతులు దాదాపు 32 హెక్టార్ల భూములు కోల్పోనున్నారు. ఇటీవల శంషాబాద్ గ్రామ రైతులు నిరసన తెలిపారు.
టెండర్లు పిలిచాం సుభాశ్, డీఈ నేషనల్ హైవే
మహారాష్ట్ర నుంచి బోరజ్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి రెండు రోజుల క్రితం టెండర్లు పిలిచాం. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. మొత్తం రూ. 490 కోట్ల నిధులు మంజూరు కాగా రూ.360 కోట్లకు టెండర్లు ఆహ్వానించాం.