ఒక్క పరీక్షతో నాలుగేళ్ల డిగ్రీ .. డైరెక్ట్ పీహెచ్ డీ చేయొచ్చు

ఒక్క పరీక్షతో నాలుగేళ్ల  డిగ్రీ .. డైరెక్ట్ పీహెచ్ డీ చేయొచ్చు

దేశవ్యాప్తంగా 46 సెంట్రల్ యూనివర్సిటీలకు 2025-26 అకడమిక్ ఇయర్ కు  సంబంధించి  నాలుగు  సంవత్సరాల డిగ్రీ కోసం ఎన్టీఏ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్  నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  మార్చి 1వ తేదీన రిజిస్ట్రేషన్ మొదలయ్యి 23వ  తేదీన  ప్రక్రియ ముగుస్తుంది.  భాషా, డొమెన్,  జనరల్ స్టడీస్  మొత్తం కలిపి 37 సబ్జెక్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదలైంది, 13 భాషలలో  ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.  ఇందులో  తెలుగులో  కూడా పరీక్ష  నిర్వహించనున్నారు.  ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు.  ప్రతి విద్యార్థి ఐదు సబ్జెక్టుల వరకు పరీక్ష రాయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది.  ఈ ఒక్క పరీక్ష ద్వారానే  దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో,  అనుబంధ కళాశాలల్లో విద్యార్థులు తమ ర్యాంకు ద్వారా రిజర్వేషన్ల ఆధారంతో  సీటు పొందడానికి అవకాశం ఉంటుంది.  అదేవిధంగా విద్యార్థి దేశవ్యాప్తంగా తన ర్యాంకుతో  నచ్చిన యూనివర్సిటీలలో అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 

నాలుగేళ్ల  డిగ్రీ కోర్సులు

నూతన విద్యా విధానం 2020-లో  భాగంగా  కేంద్ర ప్రభుత్వం అన్ని కేంద్ర విద్యాసంస్థలలో  నాలుగు సంవత్సరాల  డిగ్రీని రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించింది.  ప్రస్తుతం మన రాష్ట్రంలో ‘దోస్త్’ ద్వారా విద్యార్థులు మార్కుల ఆధారంతో  మూడు సంవత్సరాల  డిగ్రీలో చేరడం జరుగుతోంది. ఈ  మూడు సంవత్సరాల డిగ్రీతో  పోల్చుకుంటే  కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నాలుగు సంవత్సరాల డిగ్రీతో విద్యార్థులకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.  ముఖ్యంగా ఒక విద్యార్థి 8 సెమిస్టర్లు పూర్తి చేసుకుంటే ఆ విద్యార్థికి డిగ్రీతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది.  దీని ద్వారా విద్యార్థి టీచర్ నియామకానికి సంబంధించి పరీక్షల్లో నేరుగా రాయడానికి అర్హత సాధిస్తాడు.  

దీంతోపాటు  పీజీ  సర్టిఫికెట్ కూడా పొందడం జరుగుతుంది.  విద్యార్థికి ఒక సంవత్సరం కాలం  ఆదా అవుతుంది.  సదరు  విద్యార్థి  75% శాతం మార్కులు సాధిస్తే  నేరుగా  పీహెచ్ డీ  చేయడానికి, నెట్, సెట్ పరీక్షలు రాయడానికి అర్హత సాధిస్తాడు.  ఈ నాలుగు సంవత్సరాల డిగ్రీ ద్వారా అనేక  ప్రయోజనాలు పొందడమే కాకుండా బహుళ సబ్జెక్టులు చదవడానికి అవకాశం ఉంటుంది.  సైన్సు చదివే విద్యార్థి ఆర్ట్స్ సబ్జెక్టు చదవడం,  ఆర్ట్స్ చదివే విద్యార్థి  సైన్సు సబ్జెక్టు చదవడానికి వీలు ఉంటుంది.  నాలుగు సంవత్సరాల డిగ్రీ విద్యార్థులు తమ  నైపుణ్యాలను పెంచుకోవడానికి  కంప్యూటర్  శిక్షణతోపాటు,  మాతృభాష  ఇతర భాషలను నేర్పేవిధంగా బోధన ఉంటుంది.  మన రాష్ట్రంలో  నాలుగు సెంట్రల్ యూనివర్సిటీలు  ఈ నాలుగు  సంవత్సరాల డిగ్రీ కోర్స్ ను అందిస్తున్నాయి.  

తెలంగాణలో..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ,  ఇఫ్లు,  మాను,  సమ్మక్క,  సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలలో  డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  మూడు యూనివర్సిటీలలో ఎక్కువ కోర్సుల ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి.  కొత్తగా ఏర్పడిన  సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో  ఇంగ్లీష్ ఎకనామిక్స్ ఆనర్స్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ విద్యార్థులు  బహుళ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు  కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ రాయాలి.  విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- డా. చింత ఎల్లస్వామి,
సమ్మక్క సారక్క
సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ