
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. ఒకే పరీక్షతో అన్ని జాతీయ సంస్థల సీట్లకూ పోటీ పడే అవకాశం కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు (సీయూఈటీ)తో దక్కుతుంది. ఇటీవలే ఆ ప్రకటన వెలువడింది. తాజా నోటిఫికేషన్‌తో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది.
విద్యార్హత: ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సీయూఈటీ రాసుకోవచ్చు. పలు కోర్సులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. మిగిలినవాటికి డిగ్రీలో సంబంధిత కోర్సు చదివినవారై ఉండాలి. అభ్యర్థులకు వయోపరిమితి లేదు.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్ష కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 75 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి ఒక గంట 45 నిమిషాలు. మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో (లాంగ్వేజ్, ఎంటెక్ హయ్యర్ సైన్సెస్, ఆచార్య పేపర్లు తప్ప) ఉంటాయి. ఇందులో 75 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.pgcuet.samarth.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.