![ఏపీలో బర్డ్ ఫ్లూ: చికెన్ తినొద్దని హెచ్చరికలు](https://static.v6velugu.com/uploads/2025/02/culling-of-live-poultry-layers-begins-to-prevent-spread-of-bird-flu-in-east-godavari-district-of-andhra-pradesh_W1XTUy85dF.jpg)
ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది.. గోదావరి జిల్లాల్లో వైరస్ తో భారీగా కోళ్లు చనిపోతున్నాయి. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో మరోసారి రెడ్ జోన్, సర్వేలెన్స్ జోన్ లు ఏర్పాటు చేశారు అధికారులు. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో సేకరించిన శాంపిల్స్ కు బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా పూణె ల్యాబ్ లో నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడ్డాయి.. ఒక్కో పౌల్ట్రీ ఫాంలో రోజుకు 10 వేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు సమాచారం.
పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను, పది కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా విధించారు అధికారులు. ఈ ప్రాంతాల పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి.
వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా వారికి యాంటీ వైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని.. బర్డ్ ఫ్లూ కేసులు గుర్తించిన పౌల్ట్రీ నుంచి ఒక కిలోమీటర్ లోపు కోళ్లు, కోడిగుడ్లను కాల్చి వేయాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్.
ఇప్పటికే 75 శాతం వైరస్ సోకిన కోళ్లు, కోడిగుడ్లను వాటిని కాల్చి వేసిన పౌల్ట్రీ యజమానులు తెలిపారు. గడచిన ఐదు, ఆరు రోజుల్లో పౌల్ట్రీ నుంచి కోళ్లను ఏయే ప్రాంతాలకు వాహనాల ద్వారా రవాణా అయ్యాయో తెలుసుకోవాలని రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన కోళ్ల శాంపిల్స్ కి సంబంధించి రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు అధికారులు.