యాదాద్రి జిల్లాలో సాగు ఇంకా పుంజుకోలే

  • భారీ వానలు కురుస్తలే 
  • వర్షపాతం ఇంకా లోటే
  • మరింత తగ్గిన భూగర్భ జలాలు 
  • టార్గెట్ 2.85 లక్షల ఎకరాలు
  • నాట్లు వేసింది 1.80 లక్షల ఎకరాలే

యాదాద్రి, వెలుగు : నాట్లు వేసే టైం దాటిపోయినా యాదాద్రి జిల్లాలో సాగు పుంజుకోవడం లేదు.  భారీ వానలు కురవకపోవడంతో చెరువుల్లో నీరు లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. బోర్లు ఆగాగిపోస్తున్నాయి. లక్ష్యానికి ఆమడదూరంలో సాగు ఆగిపోయింది. 

 టార్గెట్​2.85 లక్షలు.. 1.80  ఎకరాల్లోనే నాట్లు..

వానాకాలం–2024 సీజన్​లో 2.85 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్ అంచనా వేసింది. మూసీ కాల్వలు తప్ప.. సాగునీటి ప్రాజెక్టు లేని జిల్లాలో పూర్తిగా బావులు, బోరు బావులపైనే ఆధారపడి రైతులు సాగు చేస్తారు.  ఇప్పటివరకు జిల్లాలో భారీ వానలు కురవకపోవడంతో కొన్నిచోట్ల బోర్లు ఒట్టిపోయాయి. మరికొన్ని చోట్ల బోర్ల నుంచి మోటర్లు ఆగాగి నీరుపోస్తున్నాయి. 

నాట్లు వేసే టైం మరికొద్ది రోజుల్లో ముగిసిపోతోంది. ఇప్పటివరకు 1.80 లక్షల ఎకరాల్లోనే రైతులు నాట్లు వేశారు. పొలాలు దున్ని రెడీగా ఉన్నా.. వానలు కురవకపోవడంతో రైతులు నాట్లు వేయట్లేదు. ఆగస్టు నెలాఖరు వరకు నాట్లు వేసే అవకాశం ఉన్నందున ఇంకా వాన పడుతుందేమో అన్న ఆశతో రైతన్నలు ఎదురుచూస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణంగా లక్ష్యం చేరుకునే అవకాశాలు కన్పించడం లేదు. 

వర్షపాతం ఇంకా లోటే..

ఈ సీజన్​లో జిల్లాలో వర్షపాతం ఇంకా లోటుగానే ఉంది. సాధారణ వర్షపాతం 306.8 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 277 మిల్లీ మీటర్లే నమోదైంది. ఇంకా వర్షపాతం 10 మిల్లీ మీటర్ల లోటుగానే ఉందని వాతావారణ శాఖ రిపోర్ట్​చెబుతోంది. అయితే, జిల్లాలోని నాలుగు మండలాల్లో వర్షపాతం లోటు ఎక్కువగా ఉంది. భారీ వానలు కురవకపోవడంతో జిల్లాలోని చెరువులు, కుంట్లలో నీరు చేరలేదు. 

తగ్గిన భూగర్భ జలాలు..

ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో భూగర్భ జలాలు పెరగలేదు. పైగా గతం కంటే మరింత తగ్గిపోయాయి. జూన్ కంటే జూలైలో భూగర్భ జలాలు మరింత తగ్గిపోయాయి. జూన్​లో 10.41 మీటర్లలో భూగర్భ జలాలు ఉండగా, జూలైలో 10.90 మీటర్లకు పడిపోయాయి. గతేడాది జూలైలో 4.74 మీటర్ల లోతుల్లో జలాలు ఉండగా, ఈ ఏడాది10.90 మీటర్ల దిగువన భూగర్భ జలాలు ఉన్నాయి. ఈ లెక్కన గతేడాది ఈ సీజన్​ కంటే ఈసారి 6.16 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోయాయని గ్రౌండ్​ వాటర్​ డిపార్ట్​మెంట్​వెల్లడించింది.