సిరికొండ, వెలుగు : ఫారెస్ట్ ల్యాండ్‌ను అక్రమంగా చదును చేసి సాగు చేసిన పంటలను ఆఫీసర్లు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న గిరిజన రైతులు ఆఫీసర్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల బీట్ పరిధిలోని ఫారెస్ట్ భూమిని జంగులోడి తండాకు చెందిన కొందరు గిరిజన రైతులు చదును చేసి వరి, పత్తి సాగు చేశారు. దీంతో డీఎఫ్‌వో నిఖిత ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు జేసీబీతో పంటలను ధ్వంసం చేశారు.
గమనించిన గిరిజన రైతులు ఆఫీసర్లపై రాళ్లు విసురుతూ వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని, ఎన్నో ఏండ్ల నుంచి కబ్జాలో ఉన్న గిరిజనులపై ఫారెస్ట్ ఆఫీసర్లు కక్ష సాధింపుతోనే పంటలు ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. చదును చేసినప్పుడు రాని ఆఫీసర్లు నెల రోజుల తర్వాత వచ్చి పంటలను ధ్వంసం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాళ్లదాడికి పాల్పడిన గిరిజన రైతులను పట్టుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో భవానీ శంకర్, ఏసీవో రాజవెంకట్‌రెడ్డి, ఎఫ్‌ఆర్‌వో వినయ్‌నాయక్, డిచ్‌పల్లి సీఐ మల్లేశ్, ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై రామ్ పాల్గొన్నారు.