- వర్షాలు రాక ముందే జిల్లాలో పంటల సాగు
- పలు చోట్ల పత్తి విత్తనాలు వేసిన రైతులు
- వానలు పడితే కూలీలు దొరకరని తొందర
కామారెడ్డి, వెలుగు: వానకాలం సీజన్వచ్చి రోజులు గడుస్తున్నా వర్షం జాడ లేదు. నైరుతీ రుతుపవనాలు వస్తాయనే ఆశతో కొందరు, అదును దాటుతుందని మరికొందరు రైతులు వానలు కురవకముందే పంటలు సాగుచేస్తున్నారు. వర్షాలు పడితే విత్తనాలు వేసేందుకు కూలీలు దొరకరని భావిస్తున్నారు. కొన్ని ఏరియాల్లో రైతులు దుక్కిలో పత్తి విత్తనాలు వేశారు. మరికొందరు రైతులు బోర్ల దగ్గర డ్రిప్‌తో పత్తి, మక్క సాగు చేసి, వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్లో 5.16 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మిర్గంలోనే వానలు పడి మక్క, పత్తి, సోయా, పప్పుదినుసుల విత్తనాలు వేయడం చాలా వరకు కంప్లీటయ్యేది.
మిర్గం ప్రారంభం నుంచి ఈ సీజన్‌కు సంబంధించి వ్యవసాయ పనులు షూరు చేస్తారు. గురువారం నాటికి మిర్గం కంప్లీటై అరిద్ర కార్తె వచ్చింది. మిర్గంలోనే విత్తనాలు వేయడం కంప్లీట్అయ్యేదని రైతులు చెబుతున్నారు. నైరుతీ రుతు పవనాల ఆలస్యంతో వానలు పడట్లేదు. ఉష్ణోగ్రతల తీవ్రతతో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే క్కులు దున్ని పంటల సాగుకు రైతులు రెడీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు రైతులు వానలు కురవక ముందే పంటలు సాగు చేస్తున్నారు.
వానలు సకాలంలో పడకపోతే ఇబ్బంది
ఈ సీజన్లో జిల్లాలో 31,335 ఎకరాల్లో పత్తి పంట సాగయ్యే వీలుందని అంచనా. సదాశివ్‌నగర్, గాంధారి మండలాల్లోని పలు ఏరియాల్లో ఇప్పటికే పత్తి విత్తనాల్ని దుక్కిలో వేస్తున్నారు. సదాశివ్‌నగర్ మండలంలోని మర్కల్, తిర్మన్‌పల్లి గ్రామాల్లో పత్తి సీడ్స్వేయడం 90 శాతం వరకు కంప్లీటయింది. అయితే దుక్కిలో సీడ్స్వేసిన తర్వాత వానలు పడకపోతే జన్యుపరంగా ప్రాబ్లమ్స్ వస్తాయని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. దుక్కిలో విత్తనం వేసి ఉంచితే వానపడగానే మొలకెత్తుతోందని రైతులు భావిస్తున్నారు. వానలు పడగానే అందరు రైతులు బీజీగా ఉంటారు. కూలీలు కూడా దొరకరని, అందుకే ముందుగానే దుక్కిలో పత్తి విత్తనాలు వేస్తున్నారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఈ పాటికి విత్తనాలు మొలకెత్తేవి.
జన్యుపర సమస్యలు వస్తయ్
వానలు పడకముందే దుక్కిలో విత్తనాలు వేస్తే జన్యుపర సమస్యలు వస్తాయి. నీటి వసతి ఉన్న చోట వరి నారు పోసుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది రైతులు వరి నారు పోసుకున్నారు.
- వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి
ఎప్పుడూ మిర్గంలోనే పత్తి పెడతం
ఎకరంన్నరలో పత్తి పంట విత్తనాలు వేసిన. ఎప్పుడు మిర్గంలోనే విత్తనాలు వేస్తాం. ఈ సారి మిర్గం పోయి అరిద్ర కార్తె వచ్చినా వానలు లేవు. అయినా దుక్కిలో విత్తనం వేస్తున్నాం. వానలు పడితే మొలక వస్తుంది.
- ఏనుగు ఆశన్న, మర్కల్
ఇప్పటికే మొలకలు వచ్చేవి
అరిద్ర కార్తె వచ్చేనాటికి మక్క, పత్తి మొలకలు వచ్చేవి. ఈ సారి ఇంకా వానలు పడలేదు. వానల పడతయనే ఆశతో ముందే పత్తి విత్తనాలు వేసినం. మా ఊరిలో చాలా వరకు వేసిన్రు. నేను కూడా 2 ఎకరాల్లో పత్తి విత్తనం వేసిన. దుక్కిలో విత్తనం వేసినంక దుబురు దుబురు వాన కాకుండా పెద్దవాన పడితే విత్తనం ఖరాబు కాదు. -
రాఘవేందర్‌రెడ్డి , తిర్మన్‌పల్లి