- ఆంధ్రా టూ భద్రాద్రికొత్తగూడెం వయా మహబూబాబాద్‌కు..
- ఇప్పటికే రూ.61.67లక్షల విలువైన గంజాయి స్వాధీనం
- నిఘాను మరింతగా పెంచుతామంటున్న పోలీసులు
మహబూబాబాద్, వెలుగు: ఒకప్పుడు మహబూబాబాద్ జిల్లా పరిధిలో గంజాయి సాగు జోరుగా కొనసాగేది, కాలక్రమేణ సాగు శాతం తగ్గిపోయినా మహబూబాబాద్ జిల్లా నుంచి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పలుమార్లు పట్టుబడుతున్నా స్మగ్లర్లు గంజాయి రవాణాకు పాల్పడుతున్నారు.
దొడ్డిదారుల్లో రవాణా..
ఆంధ్రలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి ప్రధాన రహదారి వెంట కాకుండా కాలి బాటలు, కెనాల్స్ వివిధ మార్గాల్లో ఎండు గంజాయిని మహబూబాబాద్ జిల్లాకు చేర్చి ఇక్కడి నుంచి డోర్నకల్, కేసముద్రం, మహబూబాబాద్, వివిధ రైల్వే స్టేషన్ల ద్వారా సుదూర ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నారు. పట్టణాలు, చెరువు కట్టలు, మామిడి తోటలు, ఇతర నిర్మానుష్య ప్రాంతాల్లో ఎండు గంజాయిని నిల్వ ఉంచి చిన్న ప్యాకెట్లుగా మార్చుతూ యువత, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని విక్రయిస్తున్నారు. దీంతో ఎంతో భవిష్యత్ ఉన్న వారు సైతం గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు.
భారీగా పట్టుబడుతున్న గంజాయి..
మహబూబాబాద్ జిల్లాలో 2021లో 851.35 కేజీల గంజాయి లభించగా, 17 మంది పై కేసు నమోదు చేశారు. 2022లో 165.05 కేజీల గంజాయి లభించగా, 11 మందిపై కేసు నమోదు చేశారు. 2023లో 276.66 కేజీల గంజాయి లభించగా, 10 మంది పై కేసు నమోదు చేశారు. 2024లో ఆగస్టు నెలాఖరు వరకు 246.17 కేజీల గంజాయి లభించగా, దీని విలువ రూ.61.67లక్షల వరకు ఉండగా, పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు.
సరిహద్దుల్లో నిఘా పెంచుతాం..
మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల్లో నిఘాను పెంచుతాం. అడిషనల్‌గా చెక్ పోస్టులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయవలసి ఉంది. వాహన తనిఖీలను పెంచాం. జిల్లాలోని వివిధ రైల్వే స్టేషన్ల వద్ద, గంజాయి తయారీ, సరఫరా, వినియోగం చేసే వారిపై నిఘా పెంచుతాం. గంజాయి సేవించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటున్నాం. ప్రజలు అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు అందించాలి.
ఎస్పీ రామ్నాథ్కేకన్, మహబూబాబాద్ జిల్లా