కౌలురైతుల కష్టాల సేద్యం

గుంట జాగ లేకపోయినా ఎవుసంపై మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న కౌలు రైతులు ఎలాంటి ఆదరణ లేక కాడి వదిలేస్తున్నారు. రైతుగా పొందాల్సిన ఏ మేలు పొందలేకపోతున్నారు. కౌలు ఒప్పందాలన్ని నోటి మాట మీద జరగుతున్నాయి. పంట రుణాలు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా రైతులకు అందే ఏ సాయం కౌలు రైతులకు అందడం లేదు. భూమిపై ఎలాంటి హక్కు లేని కౌలు దారులకు ప్రభుత్వపరంగా ఎలాంటి చేయూత అందక ఆర్థికంగా నష్టపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 40 శాతం మేర సాగు భూమి కౌలురైతుల చేతిలో సాగవుతున్నది. అయినా ప్రభుత్వం వారిపై కనికరం చూపడం లేదు.

అక్కరకు రాని కౌలు చట్టాలు

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశ గ్రామీణ జనాభాలో 35 శాతం కౌలు రైతులే. కౌలుదారుడికి సాగుదారుడుగా గుర్తింపు లేని ఆ  దశలో కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల్లో భాగంగా కౌలుదారి సంస్కరణలు చేపట్టింది. కౌలుదారుల సమస్యలు పరిష్కరించి వారికి తగిన రక్షణ కల్పించడానికి దేశంలో అన్ని రాష్ట్రాలు చట్టాలు చేశాయి. తెలంగాణలో1950లో అమలులోకి వచ్చిన కౌలు వ్యవసాయ భూముల చట్టం కౌలుదారులుగా ఉన్న వారిని రక్షిత కౌలు దారిగా గుర్తించి వారికి భూమిపై పట్టా హక్కులు కల్పించారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో కౌలు చట్టాలు అమలు కాలేదు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలుదారుల రక్షణ కోసం జయతి ఘోష్ట్​​ అధ్యక్షతన కమిటీ నియమించింది. కౌలుదారులను సాగుదారులుగా గుర్తించాలని కమిటీ సిఫార్సులు చేసింది. ఆ తర్వాత వచ్చిన కోనేరు రంగారావు కమిటీ కౌలు రైతుల సంక్షేమం కోసం కొన్ని సిఫార్సులు చేసింది. కోనేరు రంగారావు భూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో భూ అధీకృత సాగుదారుల చట్టం తెచ్చింది. ఈ చట్టం ద్వారా కౌలు రైతులు రుణ అర్హత కార్డులు, బ్యాంకు రుణాలు కొంతవరకు పొందగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతుల కష్టాలను పట్టించుకునే వారే కరువయ్యారు.

సమగ్ర చర్యలు అవసరం

తెలంగాణ రాష్ట్రంలో 61 లక్షల మంది భూ యజమానులు ఉంటే దాదాపుగా 21.71 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు రైతు స్వరాజ్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. పంట పోయినా, భూమి చేతిలో ఉందిలే అనుకునే పరిస్థితి కౌలు రైతులది కాదు. రైతుల నుంచి భూమిని కౌలుకు తీసుకొని సాగుచేసి నిలదొక్కుకోవడం చాలా కష్టంగా మారింది. పెట్టుబడి కింద మొత్తం కావాల్సి రావడం, బ్యాంకులో రుణాలు మంజూరు చేయకపోవడం ప్రైవేట్ అప్పులకు పూచికత్తుగా భూమిని చూపించే పరిస్థితి లేకపోవడంతో కౌలు రైతులు అన్ని రకాలుగా దిగాలు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టం జరగడం, దిగుబడి రాకపోవడంతో అప్పులు ఇచ్చిన వ్యాపారులే బలవంతంగా పంటలు లాక్కుంటున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ 2021 లెక్కల ప్రకారం.. తెలంగాణలో 2018లో 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2019లో 491మంది, 2020లో466 మంది, 2021లో 352 మంది రైతులు సూసూడ్​చేసుకున్నారు.

ఇందులో సింహ భాగం రైతులు కౌలుదారులే. 2018లో రైతు బంధు పథకం అమల్లోకి తెచ్చిన సర్కారు.. పట్టాదారులకు రూ.10 వేల పెట్టుబడి సాయం ఇస్తూ, కౌలు రైతులను విస్మరించింది. భూమిలేని కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే రైతు బీమా కూడా లేదు. ఉత్తర్వు 194 ప్రకారం రైతుల ఆత్మహత్యలపై విచారణ చేయడం నామమాత్రంగా మారింది. రాష్ట్రంలో కౌలు విస్తీర్ణం, కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్నది. వారిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం, రుణ అర్హత కార్డులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. రైతు బీమా వర్తింపజేయాలి. ఉచిత విత్తనాలు ఇవ్వాలి. కిసాన్ రుణ కార్డుల ద్వారా ఎలాంటి హామీ లేకుండా బ్యాంకులో సహకార సంస్థల ద్వారా రుణాలు అందించాలి. 

– అంకం నరేష్