- సగానికిపైగా సన్నాలే రికార్డు స్థాయిలో 60శాతం సన్న వడ్ల సాగు
- మొత్తం 60.39 లక్షల ఎకరాల్లో వరి.. అందులో 36.80 లక్షల ఎకరాల్లో సన్న రకాలే
- సర్కార్ రూ.500 బోనస్ ప్రకటించడంతో రైతుల మొగ్గు
- గతంలో 25 నుంచి 30 శాతమే సన్నాల సాగు
హైదరాబాద్, వెలుగు: ఈ సీజన్లో సన్న వడ్ల సాగు భారీగా పెరిగింది. ఈ వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 60.39 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా, అందులో 36.80 లక్షల ఎకరాల్లో సన్న వడ్లే సాగైనట్టు వ్యవసాయ శాఖ అధ్యయనంలో తేలింది. అంటే మొత్తం వరి సాగులో 60 శాతం సన్న రకాలే. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఈ సీజన్ నుంచే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో రైతులు సన్న వడ్ల సాగు వైపు మొగ్గు చూపారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే సన్న వడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. దొడ్డు, సన్న వడ్ల కొనుగోలుకు వేర్వేరుగా సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
సన్నాల సాగును ప్రోత్సహించని గత ప్రభుత్వం
రాష్ట్రంలో 80 శాతానికి పైగా కుటుంబాలు సన్న బియ్యమే తింటున్నాయి. సన్న వడ్లకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహించలేదు. గతంలో 25 నుంచి 30 శాతానికి మించి సన్న వడ్ల సాగు జరగలేదు. రైతులు కొన్నేండ్లుగా 20 లక్షల ఎకరాలకు మించి సన్నాలు సాగు చేయలేదు. మూడేండ్ల కింద అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సన్న వడ్లు వేయాలని, బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ ఆ తర్వాత అమలు చేయలేదు. దీంతో రైతులు సన్న వడ్లను మద్దతు ధర కంటే తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగును చాలా వరకు తగ్గించి దొడ్డు రకాలనే సాగు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ బోనస్ ప్రకటించడంతో సన్నాల వైపు మొగ్గు చూపారు.
సన్న బియ్యం పంపిణీకి సర్కార్ ప్రణాళిక..
ప్రభుత్వం ఇప్పటికే హాస్టళ్లు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చే జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో 25 లక్షల టన్నుల మేర సన్న బియ్యం డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు సన్నాల సాగు పెరగడంతో డిమాండ్ కు సరిపడా సరఫరా మన రాష్ట్రంలోనే ఉండనుంది.
గతంలో డిమాండ్ కు తగ్గట్టు సన్న బియ్యం అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించి సన్నాల సాగును ప్రోత్సహించడంతో ఈసారి 36.80 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగయ్యాయి. తద్వారా 88 లక్షల టన్నుల పంట దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ వడ్లను కొనుగోలు చేసి బియ్యంగా మార్చి రేషన్‌లో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
పెట్టుబడి ఎక్కువే..
సన్న రకాలు సాగు చేస్తే, దొడ్డు రకాల కంటే ఎక్కువ కాలం నీళ్ల అవసరం ఉంటుంది. చీడ పీడలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో పెస్టిసైడ్స్ కోసం ఎకరాకు అద నంగా రూ.5 వేల వరకు పెట్టుబడి పెరుగుతుంది. అలాగే దొడ్డు రకాలతో పోలిస్తే సన్నాల దిగు బడి ఎకరానికి మూడు నుంచి ఐదు క్వింటాళ్ల మేర తక్కువ వస్తుంది. దీంతో ఇన్నాళ్లు రైతు లు సన్న రకాల సాగుకు ముందుకురాలేదు.
అయితే ప్రస్తుతం ప్రభుత్వం బోనస్ ప్రకటించ డంతో పెట్టుబడి పోను లాభం చేకూరే అవకాశం ఉందని రైతులు సన్నాల వైపు మొగ్గు చూపుతు న్నారు. బోనస్ తో రైతులకు అదనపు భారం తప్పి, లాభం చేకూరుతుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.