- యాదాద్రి ఇరిగేషన్ ఆఫీసర్లఫై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సీరియస్
- జనం లేక సాగు నీటి దినోత్సవం వెల వెల
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో నిర్వహించిన సాగు నీటి దినోత్సవం మీటింగ్ వెలవెలబోయింది. రైతులు వస్తారేమోనని గంటల తరబడి వెయిట్చేసినా రాకపోవడంతో చివరికి ఎలాగోలా ముగించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలోని ఓ ఫంక్షన్‌హాలులో బుధవారం సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఇందులో పాల్గొనడానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి వచ్చారు. ఆయన వచ్చేసరికి కుర్చీలన్నీ ఖాళీగా కన్పించడంతో ఆశ్చర్యపోయారు. జనం మెల్లిగా వస్తారులే అనుకొని గంటకు పైగా ఎదురుచూసినా ఎవరూ రాలేదు. ఉత్సవాల్లో 600 నుంచి వెయ్యి మంది వరకు పాల్గొనేలా చూడాలని పై నుంచి ఆదేశాలుండగా అతితక్కువ మంది రావడంతో నిరుత్సాహపడ్డారు.
కలెక్టర్ పమేలా సత్పతి చేరుకునే సరికి కూడా పరిస్థితి అలాగే ఉంది. మధ్యాహ్నం 1.30 గంటల వేచి చూసినా జనం రాకపోవడంతో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ఆఫీసర్లను పిలిచి ‘మీటింగ్‌లో మీరు.. నేనేనా ఉండేది. జనం ఏరీ’ అని ప్రశ్నించారు. ‘ఇంత పెద్ద కార్యక్రమానికి రైతులకు సమాచారం ఇచ్చి రప్పించాల్సిన అవసరం లేదా?’ అని నిలదీశారు. తర్వాత వచ్చిన వారికే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించారు. రచయిత జూలూరు గౌరీశంకర్ రాసిన ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాగునీటి రంగంపై ఇరిగేషన్ఎస్ఈ శ్రీనివాస్ ప్రగతి నివేదిక వినిపించారు.