పాలెం(నాగర్ కర్నూల్), వెలుగు: ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల కింద యాసంగి సాగుకు మార్చి 31 వరకే సాగు నీరు ఇస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చెరువులు, బోర్లు ఉన్న రైతులు మాత్రం మార్చి తర్వాత సాగు చేసుకోవచ్చని సూచించారు. శనివారం పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆయన అధ్యక్షతన సాగునీటి సలహా బోర్డు మీటింగ్ నిర్వహించగా.. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, డా.అబ్రహం, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కలెక్టర్లు ఉదయ్ కుమార్,షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్ పర్సన్లు, ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల పరిధిలోని జూరాల, ఆర్డీఎస్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల కింద యాసంగి సాగుకు నీళ్లివడంపై చర్చించారు. కష్ణా, తుంగభద్ర నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌లో డెయిలీ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి విడుదలపై సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి సమగ్ర సాగునీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ నిర్ణయమే అంతిమమన్నారు. సాగు, తాగునీరు, పవర్ జనరేషన్ అవసరాలపై ఇరిగేషన్, జెన్కో, వ్యవసాయ శాఖల నివేదికల అనంతరం ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుందని, దాని ఆధారంగానే సాగునీటి విడుదలపై నిర్ణయం ఉంటుందన్నారు.
అధికారులకు అవగాహన ఉండాలి
ఏయే ప్రాజెక్టులో ఎంత నీరు అందుబాటులోఉంటుందో, ఏ పంటకు ఎప్పటి వరకు సాగునీరిస్తామనే అధికారులకు అవగాహన ఉండాలన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు తగ్గే నాటికి లిఫ్ట్‌ల కింద అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపాలని సూచించారు. సమైక్య రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కేఎల్‌ఐ కింద 5లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉన్నా 40 టీఎంసీలు నిల్వచేసుకునే అవకాశం లేదన్నారు. కేవలం 4 టీఎంసీల కెపాసిటీ ఉన్న మూడు రిజర్వాయర్లే దిక్కవుతున్నాయని వాపోయారు. ఆన్‌లైన్ రిజర్వాయర్ల నిర్మాణం గురించి సీఎం చర్చించి సర్వే పూర్తి చేయించినా.. భూ సేకరణ సమస్య కారణంగా పెద్ద చెరువులను విస్తరించాలనే ప్రతిపాదన ఉందన్నారు .
కేఎల్‌ఐ కింద 5 లక్షల ఎకరాలు
కేఎల్‌ఐ ప్రాజెక్ట్ పూర్తి కాకపోయినా వానాకాలంలో 5 లక్షల ఎకరాలు, యాసంగిలో 2.64లక్షల ఎకరాల వరకు సాగునీరు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. సమైక్య రాష్ట్రంలో మొదటి లిప్ట్ ద్వారా కేవలం 12వేల ఎకరాలకు నీళ్లిచ్చేవారని, తెలంగాణ వచ్చాక మంత్రి హరీశ్ రావు ప్రాజెక్టుల నిద్ర చేపట్టి పనులు పూర్తి చేయించారని స్పష్టం చేశారు. ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయని, ఇరిగేషన్ అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్యాకేజీల వారీగా ఎస్టిమేషన్లు రెడీ చేయాలని సూచించారు. కేఎల్‌ఐ 29,30 ప్యాకేజీల కింద అసంపూర్తి పనులపై దృష్టి పెట్టాలన్నారు. ఈజీఎస్ కింద డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌లో పూడిక తీయించాలని కలెక్టర్లను ఆదేశించారు. మార్చి 31 లోగా ఎస్టిమేట్ వేసుకుని కాల్వల్లో నీళ్లు బంద్ కాగానే పూడిక, రిపేర్లు చేపట్టాలన్నారు. ఏప్రిల్, మే నెలలో వడగండ్లు, ఈదురు గాలలతో పంటనష్టపోయే ప్రమాదం ఉంటుందని, రైతులు మార్చి చివరి వరకు పంట చేతికందేలా చూసుకోవాలని కోరారు. ఆరుతడి పంటలు, నూనెగింజల పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జూరాల కింద 34,900 ఎకరాలకు సాగునీరిస్తామన్నారు.
మీడియాకు నో ఎంట్రీ
సాగునీటి అడ్వైజరీ బోర్డు మీటింగ్‌కు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాకు అనుమతి ఇవ్వలేదు. వేల కోట్ల ప్రాజెక్టులు, లక్షల మంది రైతుల ప్రయోజనాలపై నిర్వహించిన మీటింగ్‌కు మీడియాను రానివ్వకపోవడంపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి. పారదర్శకత, జవాబుదారీ ఎలా ఉంటుందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు.
కేసీఆర్ సీఎం అయ్యాక కరువు లేదు
కేసీఆర్ సీఎం అయిన తర్వాత కరువు ముచ్చట లేకుండా పోయిందని, ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోందని మంత్రి చెప్పారు. ప్రాజెక్టులు, కాల్వలు, సాగునీటి సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు, రైతుల కొంచెం గట్టిగా వాయిస్ వినిపిస్తారని, పాజిటివ్‌గా తీసుకోవాలని ఇరిగేషన్ ఇంజనీర్లను కోరారు. మీటింగులో మాట్లాడిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఆర్డీఎస్ తమకు గుదిబండగా మారిందని, నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అటు కర్నాటక, ఇటు ఏపీ ప్రభుత్వాలు సమస్యలు సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలంపూర్, క్యాతూర్, రాజోలి, భూత్ఫూరు, తూర్పు గగ్గలపాడు లిఫ్టులలో మోటార్లు పనిచేయడం లేదని మంత్రి దృష్టికి తెచ్చారు. నెట్టెంపాడు కింద ఎన్ని ఎకరాలకు నీళ్లిస్తారని అడిగారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కేఎల్‌ఐ ప్రాజెక్టు పూర్తి చేయాలని , కెనాల్స్ ను బాగుచేసి అవసరమైన చోట బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కోరారు. వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా మాట్లాడుతూ నిరుడు సాగునీరు అందక టెయిల్ఎండ్ రైతులు ఇబ్బందులు పడ్డారని, ఈసారి అలా జరనివ్వొద్దని అధికారులకు సూచించారు.