-
రవీంద్ర భారతిలో బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రవీంద్రభారతిలో ఆదివారం బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై వందలాది మంది మహిళలతో కలిసి ఆడి పాడారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు అపురూపమైన పండుగని, ఈ పండుగ మనలో గొప్ప శక్తిని, నైపుణ్యాన్ని వెలికితీస్తుందన్నారు. బతుకు, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచే పండుగ అని చెప్పారు. బతుకమ్మను పేర్చడంలోనే ఓ గొప్ప కళాత్మకత ఉందన్నారు.
మహిళా శక్తికి, వారి నైపుణ్యాలకు బతుకమ్మ ఒక ఉదాహరణ అని, గునుగు పూలు, తంగేడు పూలు, సీతజడ పువ్వు ఇలా రకరకాల పూలతో ఏర్పాటు చేసే బతుకమ్మ ఒక జీవన పాఠం అని, పూలనే దేవుడిగా కొలిచే సంప్రదాయం తెలంగాణలో తప్ప మరెక్కడా లేదన్నారు. ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు, జీవన విలువలకు మహిళలు వారధిగా నిలుస్తున్నారన్నారు.
రవీంద్ర భారతిలో సకల జనులు, సబ్బండ వర్గాల ప్రజలకు అందుబాటులో తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజా ఆమోదయోగ్యమైన కార్యక్రమాలను చేపడుతున్న భాషా సాంస్కృతిక శాఖను ఆమె అభినందించారు. తొలుత బాగ్ లింగంపల్లి నుంచి లింగంపల్లి వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు సీతక్కకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమెతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.