ఓరుగల్లులో పెరుగుతున్న తల్వార్లు, కత్తుల కల్చర్‍

  • బర్త్ డే ప్రోగ్రామ్‌‌లంటూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్న యూత్‌‌
  • అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ వ్యాపారులకు చిల్లర గ్యాంగ్‌‌ బెదిరింపులు
  • కత్తులు, కటార్లతో రోడ్లపై హల్‌‌చల్‌‌ చేస్తున్న యువకులు
  • పట్టించుకోని పోలీసులు

వరంగల్‍, వెలుగు : వరంగల్‌‌ నగరంలో రోజురోజుకు తల్వార్లు, కత్తుల కల్చర్‌‌ పెరిగిపోతోంది. కొందరు వ్యక్తులు కత్తులు, కటార్లతో యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతూ, ఫొటోలకు ఫోజులు ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరికొందరైతే తాము అడిగింది ఇవ్వకుంటే నరికేస్తామంటూ వ్యాపారులను బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు బహిరంగంగానే జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడెనిమిదేళ్ల కింద ఇలాంటి కల్చర్‌‌ కనిపించినా అప్పుడు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో ఘటనలు తగ్గాయి. కానీ గతేడాది నుంచి మళ్లీ ఈ కల్చర్‌‌ పెరిగింది.

ఎమ్మెల్యేలు, లీడర్లే రోల్‌‌ మోడల్స్‌‌

తల్వార్లు, కత్తుల కల్చర్‍ పెరగడానికి ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు, లీడర్లే ప్రధాన కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొలిటికల్‌‌ మీటింగ్‌‌లు, సభలు, బర్త్ డే ఫంక్షన్లలో లీడర్లు తల్వార్లు పట్టుకొని ఫోజులు ఇస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుంటున్న కేడర్‌‌, యూత్‌‌ సైతం తమ బర్త్‌‌ డే ప్రోగ్రాముల్లో తల్వార్లతో కేక్‌‌ కట్‌‌ చేస్తూ హల్‌‌చల్‌‌ చేస్తున్నారు. ప్రతి రోజు నగరంలోని ఏదో ఒక గల్లీలో ఓ లీడర్‌‌ బర్త్‌‌డే సెలబ్రేషన్స్‌‌ జరుగుతున్నాయి. దీంతో ఆ కాలనీ జంక్షన్‌‌ వద్ద పది, పదిహేను మంది కలిసి కేకులు, కత్తులతో హంగామా సృష్టిస్తున్నారు. దీనికి తోడు రోడ్లపైనే ‘మందు’ పార్టీ చేసుకుంటున్నారు. ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేస్తున్నారు. 

వ్యాపారులకు బెదిరింపులు

కత్తులు, తల్వార్లు పట్టుకొని కొందరు యువకులు పార్టీలు చేసుకుంటుంటే, మరికొందరు వాటితో వ్యాపారులను బెదిరిస్తున్నారు. కత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. వందలాది మంది తిరిగే సమయాల్లోనే రౌడీమూకలు కత్తులతో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండతోనే ఇలాంటి వారు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు

నగరంలో రోజురోజుకు కత్తుల కల్చర్‌‌ పెరిగిపోతున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కల్చర్‌‌కు మొదట్లోనే అడ్డుకట్ట వేసి క్రైం రేటు తగ్గించేలా చొరవ చూపాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్‍ మీడియాలో పోస్టింగ్‌‌ల ఆధారంగా కొందరిపై కేసులు పెట్టినప్పటికీ ఆ తర్వాత లైట్‌‌ తీసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

ఇటీవలి ఘటనలు

  • వరంగల్‌‌ నగరంలోని ఇంతేజార్‌‌ గంజ్‌‌ పీఎస్‌‌ పరిధిలోని అఖిల బార్‍లోకి గురువారం రాత్రి ఓ వ్యక్తి వచ్చి ఫుల్‌‌ బాటిల్‌‌ మందు అడిగాడు. సిబ్బంది డబ్బులు అడగడంతో అక్కడి నుంచి వెళ్లిన యువకుడు కొద్దిసేపటి తర్వాత పొడవాటి తల్వార్‌‌తో వచ్చి కౌంటర్‌‌ మీదున్న వ్యక్తిని నరికి పారేస్తా అంటూ బెదిరించాడు. 
  • కాశీబుగ్గకు చెందిన మధుకర్‌‌ అలంకార్‌‌ ఏరియాలోని ఓ చికెన్‌‌ సెంటర్‌‌లో పనిచేస్తున్నాడు. ఈ ఏడాది మార్చి 1న ఉదయం మధుకర్‌‌ నిద్రలేచే టైంకు తన బైక్‌‌ సీటుపై ఓ కత్తి గుచ్చి ఉంది. ‘నీ పని ఇంతే’ అంటూ ఓ మెమొరీ కార్డులో వాయిస్‌‌ రికార్డ్‌‌ చేసి మరీ అక్కడ పెట్టారు.
  • గతేడాది డిసెంబర్‌‌లో శంభునిపేట ప్రాంతంలో కొందరు వ్యక్తులు కత్తులు, తల్వార్లతో హల్‌‌చల్‌‌ చేశారు. అరుణ్‍ అనే వ్యక్తిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే కరీమాబాద్‍ ఉర్సు బొడ్రాయి సమీపంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరగగా, కాసేపట్లోనే కొందరు వ్యక్తులు తల్వార్లు, వేట కొడవళ్లు, కత్తులతో ఫైటింగ్‌‌ చేసుకున్నారు.