- సీతమ్మ సాగర్బ్యాక్ వాటర్ తో మునిగిపోకుండా ఉండేందుకు కరకట్టల నిర్మాణం
- ఈ ప్రాజెక్టు పూర్తయితే ఐదు మండలాలకు ముంపు ముప్పు
- లెవీల నిర్మాణానికి రూ.1300 కోట్లు మంజూరు
- ముంపు భయంలో సుమారు 50 గ్రామాలు
భద్రాచలం, వెలుగు: సీతమ్మ సాగర్ బ్యాక్‌వాటర్‌తో గోదావరికి ఇరువైపులా ముంపునకు గురయ్యే గ్రామాలను రక్షించేందుకు చేపట్టిన కరకట్టల నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, సీతమ్మ సాగర్ బ్యారేజీకి వ్యతిరేకంగా ఎన్జీటీలో వేసిన కేసులతో కాంట్రాక్ట్ సంస్థ చేతులెత్తేసింది. ఇప్పటికే సబ్ కాంట్రాక్టర్లు తట్టాబుట్ట సర్దుకొనిపోవడంతో సుమారు 50 గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. సీతమ్మ సాగర్ బ్యారేజీ వల్ల బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురయ్యే గ్రామాలను రక్షించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరకట్టల నిర్మాణాన్ని ప్రారంభించింది.
అశ్వాపురం, -దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరిపై చేపట్టిన ఈ బ్యారేజీ వల్ల అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో సుమారు 50 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వాటిని రక్షించేందుకు గోదావరికి ఇరు వైపులా కుడి వైపు 49 కిలోమీటర్లు, ఎడమ వైపు 57 కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణానికి భూసేకరణ కూడా పూర్తయింది. రూ.1300 కోట్ల అంచనాలతో టెండర్లు దక్కించుకున్న ఎల్అండ్టీ కంపెనీ పనులు ప్రారంభించింది. కానీ సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేకపోవడంతో పలువురు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఆ పనులపై ఎన్జీటీ స్టే విధించింది. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి 35 శాతం మాత్రమే ఫండ్స్ రావడంతో సబ్ కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసి, తట్టాబుట్ట సర్దుకున్నారు.
క్వాలిటీ లేకుండా పనులు..
కరకట్టల నిర్మాణ పనులు దక్కించుకున్న ఎల్అండ్టీ కంపెనీ.. ఆ పనులను సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఈ ఏడాది కురిసిన వర్షాలకు పనుల్లో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. సబ్ కాంట్రాక్టర్లు స్థానికంగా దొరికే మెటీరియల్‌తోనే పనులు కానిచ్చేశారు. రోలింగ్, క్యూరింగ్, ఎర్ర, నల్లమట్టి సమపాళ్లలో వేసి నిర్మాణం చేయకపోవడంతో కట్టలు ఎక్కడికక్కడ బీటలు వారాయి. ఈలోగా పనులపై ఎన్జీటీ స్టే విధించడం, బిల్లులు రాకపోవడం వంటి కారణాలతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు కరకట్టల పనులు కేవలం 45 శాతం మేర పూర్తయ్యాయి. అవి కూడా మట్టి పనులే చేశారు.
సిమెంట్వర్క్స్ చేయకపోవడంతో వరదలు వస్తే గ్రామాల్లోకి సీతమ్మ సాగర్ బ్యారేజీ బ్యాక్ వాటర్ వచ్చే ప్రమాదముంది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు, ఓవర్ ఎస్టిమేషన్స్ తదితర అంశాలపై దర్యాప్తు చేపడుతోంది. ఇవన్నీ పూర్తయి తిరిగి పనులు ప్రారంభం కావాలంటే ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి. దీంతో వరదల గండాన్ని తలుచుకుని గోదావరి తీరవాసులు వణికిపోతున్నారు.
గోదారికి వరదొస్తే దారుణమే
ఈసారి గోదావరికి వరద వస్తే పర్ణశాల ప్రాంతంలో దారుణంగా ఉంటుంది. ఎందుకంటే కరకట్టల పేరుతో మొత్తం తవ్వేశారు. పనులు ఆపేశారు. ఇప్పుడు వరద మొత్తం గ్రామాన్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది. గతంలో ఎప్పుడు కూడా పర్ణశాల, సీతానగరం రోడ్డు బ్లాక్ కాలేదు. కానీ కరకట్టల పనులు మొదలుపెట్టాక ఇటీవల వరదలకు రోడ్లు మూసుకుపోయాయి. అటు పర్ణశాల ఆలయానికి ప్రమాదం పొంచి ఉంది. తక్షణమే పనులు మళ్లీ మొదలుపెట్టాలి.
- వరలక్ష్మి, సర్పంచ్, పర్ణశాల
త్వరలో పనులు ప్రారంభిస్తం
త్వరలోనే కరకట్ట పనులు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం అవి 45 శాతమే పూర్తయ్యాయి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. టెక్నికల్ సమస్యల వల్ల కాస్త గ్యాప్ వచ్చింది. మరో రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తం. - శ్రీనివాస రెడ్డి, ఈఈ