- ఇటీవల అదృశ్యమైన ఆరుగురిలో ముగ్గురు మహిళల డెడ్‌బాడీలు లభ్యం
ఇంఫాల్ / గౌహతి: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిరిబామ్ జిల్లాలో ఇటీవల అదృశ్యమైన ఆరుగురిలో ముగ్గురు మహిళల డెడ్‌బాడీలు శుక్రవారం రాత్రి మణిపూర్ – అస్సాం సరిహద్దులోని జిరి నది, బరాక్ నది సంగమం వద్ధ లభ్యమయ్యాయి. దీంతో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌తో పాటు పలు జిల్లాల్లో నిరసనలు చెలరేగాయి. అధికారులు శనివారం సాయంత్రం 4:30 గంటల నుంచి ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించారు.
జిరిబామ్ జిల్లాలోని బోకోబెరాలో కుకీ టెర్రరిస్టులుగా అనుమానిస్తున్న కొందరు ఈ నెల 11న (సోమవారం) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో పది మంది దుండగులు మృతిచెందారు. వారంతా కుకీ టెర్రరిస్టులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, వారి ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోయారు. వారిని కుకీలే కిడ్నాప్ చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జిరి నది, బరాక్ నది సంగమం వద్ధ ఓ మహిళ, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారి డెడ్ బాడీలను పోలీసులు పోస్టుమార్టం కోసం సిల్చార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు తరలించారు.
కాగా.. ఈ ఘటనకు సంబంధించిన విషయం తెలియగానే హత్యకు గురైన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంఫాల్‌లో నిరసనలు చెలరేగాయి. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇండ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో మణిపూర్ ప్రభుత్వం శనివారం ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించింది. ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని హోం మంత్రిత్వ శాఖ భద్రతా బలగాలను ఆదేశించింది.