
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉన్నత చదువులు చదివి నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ఓ వ్యక్తిని మహేశ్వరం జోన్ పోలీసులు, పహాడీ షరీఫ్ పోలీసులతో కలిసి ఎస్వోటీ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.5 లక్షల విలువైన రూ.500 నోట్లను, 45 జీఎస్ఎమ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమరచింతకు చెందిన కార్లి నవీన్ కుమార్.. సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశాడు.
ఉబెర్, రాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్న అతను.. డబ్బులు సరిపోక ఈజీ మనీ కోసం సెర్చ్ ఆన్ లైన్ నకిలీ కరెన్సీ తయారీ గురించి తెలుసుకున్నాడు. యానిమేషన్, డిజైనింగ్‌లో నాలెడ్జ్ ఉండటంతో నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి ప్లాన్ చేశాడు. ఈపీఓఎన్ కలర్ ప్రింటర్‌ను ఉపయోగించి నకిలీ రూ.500 నోట్లను తయారు చేశాడు. అలా.. రూ.5 లక్షల నకిలీ రూ.500 నోట్లు తయారు చేశాడు.
గురువారం ఆ నకిలీ నోట్లను తన ఏజెంట్‌కు ఇవ్వడానికి నవీన్ తుక్కుగూడకు వస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్‌లోని దివిటిపల్లి చౌరస్తాలో అతను ఉంటున్న అద్దె ఇంటిలో సోదాలు చేసి, ల్యాప్ టాప్, ప్రింటింగ్ మెషిన్లను, స్వాధీనం చేసుకున్నారు.