సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డ్‌కు ఈ ఏడాది ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆయన బాలీవుడ్‌లో హీరోగానే కాకుండా సహాయనటుడు, విలన్‌గా ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించారు.
లోగనాథన్ ధనుష్
తమిళనాడుకు చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ లోగనాథన్ ధనుష్ పురుషుల 55 కేజీల విభాగంలో ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో సత్తా చాటాడు. ఈ పోటీల్లో పతకం గెలిచిన భారత తొలి పురుష వెయిట్‌లిఫ్టర్‌గా రికార్డు నమోదు చేశాడు.
రామ్‌చరణ్
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో టాలీవుడ్ హీర్ రామ్‌చరణ్, ఆయన పెంపుడు కుక్క రైమ్ కలిసున్న విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. మ్యూజియంలో ఇప్పటికే తెలుగు యాక్టర్స్ ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. చిరంజీవి 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో రికార్డ్ నెలకొల్పారు. దేశవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా చిరు మాత్రమే ఉన్నారు. అందుకే ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
జాతీయం
ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా అమర్‌ప్రీత్ సింగ్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) కొత్త చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీకాలం సెప్టెంబరు 30న ముగిసింది.
మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా సొంతం చేసుకున్నారు. జైపూర్ వేదికగా జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’ పోటీల్లో రియా గెలుపొందారు. గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహించనుంది.
బిహార్‌లో ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ
ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిహార్ రాజధాని పట్నాలో ‘జన్ సురాజ్ పార్టీ’ని అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి మనోజ్ భారతిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు.
Sports: టాప్టెస్ట్ బౌలర్‌గా బుమ్రా
ప్రపంచ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఐసీసీ విడుదల చేసిన జాబితాలో బుమ్రా (870 పాయింట్లు) నంబర్‌వన్ ర్యాంకు సాధించాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (869) రెండో స్థానంలో నిలిచాడు.
పర్యాటక గ్రామాలుగా సోమశిల, నిర్మల్
నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల, నిర్మల్ జిల్లా ప్రధాన కేంద్రం నిర్మల్ ఉత్తమ పర్యాటక గ్రామాల పురస్కారాలను గెలుచుకున్నాయి. స్పిరిచ్యువల్-వెల్‌నెస్ విభాగంలో సోమశిల, క్రాఫ్ట్స్ విభాగంలో నిర్మల్ గ్రామాలు ఎంపికయ్యాయి.
నేవీలోకి ఐఎన్‌ఎస్ విక్రాంత్
అరేబియా సముద్రంలో స్వదేశీ సముద్ర శక్తిని మరింత బలోపేతం చేసేందుకు దేశీయంగా తయారైన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ పశ్చిమ నౌకాదళంలో చేరింది. సముద్రం, ఆకాశం, భూమిపై ఒకేసారి కార్యకలాపాలు నిర్వహించి, దేశ భద్రతను ఇది కాపాడుతుంది.
చైనా ఓపెన్ చాంపియన్
చైనా ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆల్కరాజ్ చాంపియన్‌గా నిలిచాడు. నంబర్ వన్ యానిక్ సినెర్ (ఇటలీ)పై వరుసగా మూడోసారి గెలుపొందాడు. ఈ సీజన్‌లో ఆల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్, ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ టైటిల్స్ సాధించాడు.
జపాన్ ప్రధానిగా షిగెరు ఇషిబా
జపాన్ ప్రధాని ఫుమియో కిషిద వారసుడిగా మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అక్టోబరు 1న ఇషిబా దేశ 102వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణం చేశారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగియడంతో సెప్టెంబర్ 23వ తేదీ ప్రధాని దినేశ్ గుణవర్థనే పదవికి రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే హరిణితో ప్రధానిగా ప్రమాణం చేయించారు.
స్వలింగ వివాహాలకు గుర్తింపు
స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇచ్చిన తొలి ఆగ్నేయాసియా దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. ఇందుకు వీలు కల్పించే చరిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయ్‌లాండ్ రాజు మహా వజ్రలాంగ్‌కర్ణ్ తాజాగా సంతకం చేశారు.