- ఎండల ఎఫెక్ట్‌తో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ వినియోగం
- నిరుటితో పోలిస్తే నిత్యం 50 నుంచి 75 మిలియన్ యూనిట్లు అధికం
- రాష్ట్రంలో విద్యుదుత్పత్తి 100 మిలియన్ యూనిట్లలోపే
- 150 మిలియన్ యూనిట్ల దాకా కొనుగోలు చేసి పవర్ కట్స్ లేకుండా రాష్ట్ర సర్కారు చర్యలు
హైదరాబాద్, వెలుగు: ఎండల ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో కరెంట్వినియోగం పీక్స్‌కు చేరింది. నిజానికి యాసంగి పంటకాలం ముగిసినందున ఏప్రిల్ రెండోవారం నుంచే కరెంట్ వినియోగం తగ్గాలి.. కానీ గృహవినియోగం పెరగడంతో ఆ మేరకు కరెంట్ డిమాండ్ చుక్కలను తాకుతున్నది. ముఖ్యంగా నాలుగైదు రోజుల నుంచి తీవ్ర వడగాలులు, ఉక్కపోతల నేపథ్యంలో రాష్ట్రమంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం భారీగా పెరగడంతో పాత రికార్డులన్నీ కొట్టుకుపోతున్నాయి.
2023 ఏప్రిల్30న రాష్ట్రంలో155.9 మిలియన్‌యూనిట్ల వినియోగం ఉండగా, ఈ ఏడాది సరిగ్గా ఇదే రోజు విద్యుత్ డిమాండ్ 228 మిలియన్ యూనిట్లకు చేరింది. అయినా.. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఎలాంటి పవర్ కట్స్ లేకుండా సర్కారు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో జెన్కో, సింగరేణి నుంచి గరిష్ఠంగా 86 నుంచి103 మిలియన్యూనిట్లు మాత్రమే విద్యుదుత్పత్తి ఉండగా, ఈ కొరతను అధిగమించేందుకు వివిధ రాష్ట్రాలతోపాటు కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నది.
నిరుడితో పోలిస్తే భారీగా పెరిగిన డిమాండ్
నిరుడు ఏప్రిల్నెలలో 7 వేల మెగావాట్ల నుంచి 8 వేల మెగావాట్ల వరకు కరెంట్డిమాండ్ఉండగా, ఈ సారి 10 వేల నుంచి 11 వేల మెగావాట్లకు చేరింది. అంటే రోజుకు 3 వేల మెగావాట్ల దాకా అదనంగా డిమాండ్ఉంటోంది. 2023 ఏప్రిల్30న 155.9 మిలియన్ యూనిట్ల వాడకం ఉంటే.. ఈ ఏడాది అదే రోజు 228 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైంది. 2023 ఏప్రిల్ 29,28,27, 26వ తేదీల్లో167.8 మిలియన్యూనిట్లు,178.55 మిలియన్యూనిట్లు,177.02 మిలియన్యూనిట్లు, 159.00 మిలియన్‌యూనిట్ల విద్యుత్ డిమాండ్ నమోదుకాగా, సరిగ్గా ఈ ఏడాది అవే తేదీల్లో వరుసగా 229.5 , 218.85 , 227.77, 228.18 మిలియన్ యూనిట్ల విద్యుత్‌డిమాండ్ ఏర్పడింది. అంటే రోజుకు సగటున 50 మిలియన్ యూనిట్ల నుంచి 75 మిలియన్ యూనిట్ల వరకు ఎక్కువ విద్యుత్వినియోగం జరుగుతోంది.
వినియోగం పెరిగినా నో పవర్‌కట్స్..
ఎండల తీవ్రత కు తోడు గృహ విద్యుత్వినియోగం పెరగడంతో రాష్ట్రంలో రోజూవారీ కరెంట్ డిమాండ్220 యూనిట్లు దాటుతోంది. మంగళవారం రాష్ట్రంలో 229 మిలియన్‌యూనిట్ల డిమాండ్ ఏర్పడగా, మన దగ్గర ఉత్పత్తి అవుతున్నది కేవలం 97 మిలియన్ యూనిట్లే. టీఎస్ జెన్కో దగ్గర 64 మిలియన్ యూనిట్ల నుంచి 79 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి ఉండగా, సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి మరో 22 మిలియన్ యూనిట్ల నుంచి 24 మిలియన్‌యూనిట్ల దాకా ప్రొడక్షన్ ఉంటోంది. అంటే నిత్యం125 మిలియన్ యూనిట్ల నుంచి 150 మిలియన్ యూనిట్ల దాకా లోటు ఏర్పడుతోంది. కానీ ఎట్టిపరిస్థితుల్లో కరెంట్ కోతలు లేకుండా చూడాలన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు సెంట్రల్ పవర్ జనరేషన్ స్టేషన్లతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పవర్బ్యాంక్పాలసీల ద్వారా కరెంట్ కొనుగోలు చేసి, రాష్ట్రంలో నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నారు.
గ్రేటర్‌పరిధిలో భారీగా పెరిగిన వినియోగం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం 4,214 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైంది. నిరుడు ఇదే రోజున 2,598 మెగావాట్ల వాడకం మాత్రమే ఉంది. అంటే దాదాపు 1,614 మెగావాట్లు ఎక్కువగా నమోదైంది. నిరుడితో పోల్చుకుంటే దాదాపు 62 శాతం వినియోగం పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఆదివారం లాంటి సెలవు రోజుల్లో కూడా భారీగా కరెంటు వినియోగం ఉంటోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆదివారం విద్యుత్ వినియోగం 83.04 మిలియన్ యూనిట్లు ఉంటే నిరుడు ఇదే నెల చివరి ఆదివారం విద్యుత్ వినియోగం కేవలం 54.09 మిలియన్ యూనిట్లు మాత్రమే. నిరుడితో పోల్చుకుంటే ఒక్క గ్రేటర్‌లోనే దాదాపు 53.52 శాతం పెరగడం గమనార్హం.