వేములవాడ, సిరిసిల్ల మున్సిపల్ ఆఫీసులకు కరెంట్ కట్

వేములవాడ/సిరిసిల్ల టౌన్, వెలుగు : విద్యుత్​ బకాయిల కోసం ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా చెల్లించకపోవడంతో సెస్​ (సహకార విద్యుత్  సరఫరా సంస్థ) అధికారులు వేములవాడ మున్సిపల్​ కార్యాలయానికి విద్యుత్  సరఫరా నిలిపివేశారు. వేములవాడ సెస్​ కార్యాలయానికి మున్సిపల్​ కార్యాలయం రూ.2 కోట్ల 60 లక్షల వరకు విద్యుత్​ బకాయిలు  చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలని అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా మున్సిపల్  అధికారులు స్పందించలేదు. దీంతో రెండు రోజుల క్రితం కరెంట్  కట్  చేశామని సెస్  అధికారులు తెలిపారు. దీంతో మున్సిపల్​ కార్యాలయం అంధకారంలో ఉండిపోయింది. ఎమర్జెన్సీ సమయంలో జనరేటర్​ సహాయంతో పనులు కొనసాగిస్తున్నారు.

ఈ విషయంపై మున్సిపల్​  కమిషనర్​ను వివరణ కోరగా వచ్చే నెలలో బకాయిలు చెల్లిస్తామని చెప్పినా సెస్​ అధికారులు వినలేదని  చెప్పారు. అలాగే సిరిసిల్ల మున్సిపల్  కార్యాలయానికి కూడా సెస్  అధికారులు విద్యుత్  సరఫరా నిలిపివేశారు. గత సంవత్సరం నుంచి మున్సిపల్  ఆఫీసు  రూ.1.56 కోట్ల బకాయిలు చెల్లించలేదని సెస్  అధికారులు తెలిపారు. మున్సిపల్  ఆఫీసుతో పాటు మున్సిపల్ కు సంబంధించిన ధోబీ ఘాట్, మినీ స్టేడియం, స్ట్రీట్  లైట్లకు కరెంట్  సరఫరా నిలిపివేశారు.

దీంతో  సిరిసిల్ల పట్టణంలోని మొయిన్ రోడ్లు చీకటిమయం అయ్యాయి. దీని పై కమిషనర్ ను వివరణ కోరగా బడ్జెట్  లేకపోవడంతో బకాయిలు చెల్లించలేదని చెప్పారు. శుక్రవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్  సంస్థల నుంచి పన్నులు వసూలు చేసి బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.