రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ వేసవిని తలపిస్తోంది. జనవరి చివరిలోనే మార్చి, ఏప్రిల్ నెలల్లో మాదిరిగా అధిక డిమాండ్ నమోదైంది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు పెరగడం, యాసంగి పంటల సాగు పుంజుకోవడంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నది. గతేడాది మార్చిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్లు దాటగా.. ఈసారి జనవరి 31 నాటికే 15,205 మెగావాట్ల డిమాండ్ నమోదైంది.
నిరుడు జనవరిలో విద్యుత్ పీక్ డిమాండ్ 13,810 మెగావాట్లు కాగా, ఈ ఏడాది జనవరిలో అంతకంటే 10% ఎక్కువైంది. ఇప్పటివరకు సదరన్ డిస్కం పరిధిలో అత్యధికంగా పీక్ డిమాండ్ 8,679 మెగావాట్లు కాగా.. ఈసారి 9,589 మెగావాట్లకు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పీక్ డిమాండ్ 3,018 మెగావాట్లు కాగా.. ఈయేడు 3,334 మెగావాట్లుగా నమోదైంది.
ఇక వేసవి వచ్చేసరికి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పీక్ డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరవచ్చని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేశారు. సదరన్ డిస్కంలో 10 వేల మెగావాట్లు, గ్రేటర్ పరిధిలో 5 వేల మెగావాట్లకు డిమాండ్ చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. కరెంట్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉండాలని సర్కారు ఆదేశించింది.
రోజూ 270కి పైగా ఎంయూలు..
ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీగా 270 మిలియన్ యూనిట్ల (ఎంయూ)కు పైగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. గురువారం 273 ఎంయూలు, శుక్రవారం 277 ఎంయూలు, శనివారం 276 ఎంయూలు.. ఇలా రోజూ కరెంటు వాడకం పెరుగుతున్నది. ఇందులో 90 ఎంయూలకుపైగా జెకో ఉత్పత్తి చేస్తుండగా, సింగరేణి 26 ఎంయూలు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 129 ఎంయూలు, నేషనల్ పవర్ ఎక్చేంజీ నుంచి 42 ఎంయూలు.. ఇలా రోజువారిగా 287 ఎంయూల వరకు సేకరిస్తున్నారు.
ఈ కరెంటుతో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఈ నెలలో యావరేజ్ గా రోజూ 300 ఎంయూలకు పైగా విద్యుత్ వినియోగం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్చి నాటికి అది 320 నుంచి 330 ఎంయూలకు చేరవచ్చని చెప్తున్నారు.
సేద్యానికి పెరిగిన కరెంట్ వాడకం
ఈయేడు యాసంగి సాగు జోరందుకుంది. వానాకాలంలో లేటుగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా ఉన్నాయి. భూగర్భ జలాలతో బోర్లు రీచార్జ్ అయి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వరికి రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. నీళ్లు తక్కువగా ఉన్నవాళ్లు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్లో పంటల సాగు 60 లక్షల ఎకరాలకు చేరువకాగా, అది 70 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉంది.
జిల్లాలకు నోడల్ ఆఫీసర్లు
మార్చి, ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డ్ స్థాయిలో 17 వేల మెగావాట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవిలో ఏర్పడే డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు. అవసరమైన చోట్ల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి, లైన్లను ఆధునీకరిస్తున్నారు. ప్రతి జిల్లాకు నోడల్ ఆఫీసర్లుగా సీనియర్ ఇంజనీర్లను నియమించారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్పందించేలా విద్యుత్ కంట్రోల్ రూమ్1912ను పటిష్టం చేశారు.