చైనా మాంజాతో కరెంట్ కష్టాలు.. షార్ట్ సర్క్యూట్​తో విద్యుత్ సరఫరాలో అంతరాయం

హైదరాబాద్, వెలుగు: చైనా మాంజాతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. కరెంట్ వైర్లపై మెటల్ మాంజా పడటంతో షార్ట్ సర్క్యూట్ అవుతున్నది. దీంతో హైదరాబాద్​తో పాటు పట్టణ ప్రాంతాల్లో తరుచూ కరెంట్ సప్లై ఆగిపోతున్నది. ట్రాన్స్​ఫార్మర్లపై పతంగులు పడటంతో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇండ్లు, దుకాణాల్లో ఉన్న విలువైన సామగ్రి కాలిపోతున్నాయి. 

దీనికితోడు ప్రజలకు ప్రాణహాని కలుగుతున్నది. ఈ నేపథ్యంలో డిస్కంలు గైడ్​లైన్స్ రూపొందించాయి. సదరన్ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖి ఈమేరకు ప్రెస్​నోట్ రిలీజ్ చేశారు. ‘‘పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ తీగలు, ట్రాన్స్​ఫార్మర్ల దగ్గర్లో పతంగులు ఎగురవేయొద్దు. తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి’’అని ముషారఫ్ ఫారూఖి సూచించారు.

 

జారీ చేసిన మార్గదర్శకాలు 

 

  •  కరెంట్ వైర్లు, ట్రాన్స్​ఫార్మర్లు, సబ్ స్టేషన్లకు దూరంగా.. మైదాన ప్రదేశాల్లో పతంగులు ఎగురవేయాలి.    
  • కాటన్, నైలాన్, లెనిన్​తో చేసిన మాంజాలు మాత్రమే వాడాలి. చైనా, మెటాలిక్ మాంజాలు వాడొద్దు. మెటాలిక్ మాంజా నుంచి కరెంట్ సప్లై అవుతుంది.   
  • పొడి వాతావరణంలోనే పతంగులు ఎగురవేయాలి. మంచు, తడి వాతావరణంలో పతంగులు ఎగురవేయడంతో విద్యుత్ షాక్​కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.    
  • కరెంట్ వైర్లపై పతంగులు, మంజా పడితే వాటిని ముట్టుకోవద్దు. వాటిని పట్టుకుని లాగినప్పుడు వైర్లు ఒకదాంతో ఒకటి టచ్ అయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.  
  • ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 1912కు కాల్ చేయాలి.     
  • మొబైల్ యాప్ లేదా www.tgsouthern power.org వెబ్‌‌సైట్ ద్వారా కూడా సమాచారం అందజేయొచ్చు.