- రోజుకు 14వేల మెగావాట్లు దాటుతున్న కరెంట్
- 290 మిలియన్ యూనిట్లకు పైగా వాడకం
- నిరుటి కంటే 40మిలియన్ యూనిట్లు ఎక్కువ
హైదరాబాద్, వెలుగు: వానకాలంలోనూ రాష్ట్రంలో కరెంటు వాడకం తగ్గడం లేదు. ఆగస్టు నెలలోనూ భారీగా విద్యుత్ వినియోగం పెరగడంతో డిమాండ్ పీక్స్ చేరుకుంటున్నది. కొన్ని రోజులుగా విద్యుత్ డిమాండ్ 14వేల మెగావాట్లు దాటుతున్నది. వరినాట్లు వేగం పుంజుకోవడంతో కరెంటు వాడకం పెరిగింది. మరోవైపు వర్షాలు పడుతున్నా .. ఎండలు, ఉక్కపోతల వల్ల గృహవినియోగం కూడా భారీగా పెరిగింది. దీంతో కరెంటు డిమాండ్ పీక్స్ చేరుకుంటున్నది.
గతేడాది కంటే ఎక్కువ
రాష్ట్రంలో డెయిలీ కరెంట్ వినియోగం 290 మిలియన్ యూనిట్(ఎంయూ)లు దాటుతున్నది. ఆగస్టు 15 రోజున 14,268 మెగావాట్ల డిమాండ్ రాగా 287.48 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగం ఉంది. ఆగస్టు 14న 14,765 మెగావాట్ల డిమాండ్ రాగా 290.54 మిలియన్ యూనిట్ల కరెంట్ వాడకం జరిగింది. ఆగస్టు 13న 14,563 మెగావాట్ల విద్యుత్ డిమాడ్ రాగా 281.24 ఎంయూలు కరెంట్ సరఫరా జరిగింది. గతేడాది 2023 ఆగస్టు 15న 252.41ఎంయూలు, 2023 ఆగస్టు 14న కరెంటు వాడకం 269 ఎంయూలుగా నమొదైంది.
2023 ఆగస్టు 13న 271.66 ఎంయూలు వాడకం జరిగినట్లు ట్రాన్స్‌కో లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నిరుడుతో పోలిస్తే ఈ సారి రోజుకు 30 ఎంయూల నుంచి 40 ఎంయూల వరకు అధికంగా వాడుతున్నారు. సరఫరా అవుతున్న కరెంట్‌లో మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కరెంట్ తో పాటు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు, ఎన్సీఈ నుంచి కరెంట్ సేకరిస్తూ నిరంతరాయంగా పవర్ కట్స్ లేకుండా సరఫరా చేస్తున్నది.