డ్రైనేజీల మధ్యలోనే..కరెంట్​ స్తంభాలు!

  •     నాసిరకం పనులతో పగులుతున్న సీసీ, బీటీ రోడ్లు 
  •     కొత్తగూడెం మున్సిపాలిటీలో రూ. 60కోట్ల డెవలప్​మెంట్​ వర్క్స్​పై కొరవడిన పర్యవేక్షణ 
  •     ఇదే అదనుగా రెచ్చిపోతున్న కాంట్రాక్టర్లు! 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో డెవలప్​మెంట్​వర్క్స్​ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు కమ్యూనిటీ హాల్స్​ నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడుతోందనే విమర్శలు వస్తున్నాయి. డ్రైనేజీల మధ్యలోనే కరెంట్ స్తంభాలు ఉంటున్నాయి. చెత్తాచెదారం వస్తే ఆ స్తంభాలకు తట్టుకుని మురుగు నీరు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ వాల్స్, కప్పులు​పగుళ్లు వచ్చాయి. పట్టణంలోని బీటీ రోడ్లు అక్కడక్కడ కంకర తేలి డేంజర్​గా మారాయి.   

రూ. 60కోట్లతో పనులు.. 

కొత్తగూడెం మున్సిపాలిటీలో దాదాపు రూ.60కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో క్వాలిటీ సరిగా లేక మూన్నాళ్లకే  శిథిలావస్థకు చేరే పరిస్థితి నెలకొంది. 

  •     పట్టణంలోని సూర్యోదయ స్కూల్​ నుంచి అపార్ట్​మెంట్స్, పాత కొత్తగూడెం వెళ్లే దారిలో డ్రైనేజీ పనులు అడ్డదిడ్డంగా చేపట్టారు. కొన్ని పనులు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్​స్తంభాలను మధ్యలో ఉంచే డ్రైనేజీలు కట్టడం ఇంజినీరింగ్​అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. చెత్తతో కూడిన మురుగునీటి వరద వచ్చినప్పుడు డ్రైనేజీ మధ్యలోని స్తంభాలకు తగిలి ఆ నీరంతా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం ఆఫీసర్లకు  తెలిసినా పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. 
  •     సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల్లో సిమెంట్, కంకర, ఇసుక, వాటర్​ మిక్సింగ్​ను క్రమ పద్ధతి లేకుండా చేస్తున్నారు. గోదావరి ఇసుకను వాడాల్సి ఉన్నప్పటికీ సమీపంలోని వాగుల్లో క్వాలిటీ లేని ఇసుకను కాంట్రాక్టర్లు వాడుతున్నారు. ఈ విషయంలో ఆఫీసర్లు చూసీచూడనట్లు వదిలేస్తుండడంతో కాంట్రాక్టర్లు మరింత రెచ్చిపోతున్నారు. ఈ పరిస్థితితో చేసిన పనులు మూన్నాళ్ల ముచ్చటేనని తెలుస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆరు నెలల  కింద వేసిన సీసీ రోడ్ల నాణ్యత అప్పుడే బయటపడుతోంది. బీటీ రోడ్లు కూడా కంకర తేలుతున్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో పనులను పర్యవేక్షించాల్సిన స్పెషల్​ ఆఫీసర్లు ఎన్నికల డ్యూటీలో ఉన్నారు. ఇదే అదనుగా కాంట్రాక్టర్లు నాణ్యతను పట్టించుకోకుండా త్వరగా పనులు పూర్తి చేసి చేతులు దులుపుకునేందుకు చూస్తున్నారు.

నాణ్యతలో రాజీ పడేది లేదు

డెవలప్​మెంట్ ​వర్క్స్​ విషయంలో నాణ్యతలో రాజీ పడేది లేదు. క్వాలిటీ లేకుంటే కాంట్రాక్టర్లరకు బిల్లులు ఆపేస్తాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతరత్రా వర్క్స్​ను పక్కాగా పర్యవేక్షించాలని ఇంజినీరింగ్​ అధికారులను ఆదేశిస్తాం. 

శేషాంజన్​స్వామి. కమిషనర్​, కొత్తగూడెం మున్సిపాలిటీ

క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాం 

కొత్తగూడెం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎక్కడైనా నాణ్యత లేకుండా పనులు జరిగినట్లు ప్రజలు గుర్తిస్తే మా దృష్టికి తీసుకురావాలి. చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరిస్తాం.

 రవి కుమార్​, డీఈ, కొత్తగూడెం మున్సిపాలిటీ