- ఇటీవల తరచూ ప్రమాదాలు.. ఆందోళనలో వాహనదారులు
- దేశ వ్యాప్తంగా గత నెల రోజుల్లో కాలిపోయిన 30 బండ్లు
- ప్రమాదాలపై విచారణకు నిపుణుల కమిటీ
- తయారీలో లోపాలు, అధిక వేడే కారణాలంటున్న ఎక్స్ పర్ట్స్
హైదరాబాద్, వెలుగు: కరెంట్ బండ్లలోని బ్యాటరీలు బాంబుల లెక్క పేలిపోతున్నాయి. దీంతో మంటలు చెలరేగి బండ్లు కాలిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ సహా మన రాష్ట్రంలోనూ ఇటీవల ఇలాంటి ఘటనలు జరిగాయి. రెండ్రోజుల కింద నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి తన ఎలక్ర్టిక్ బైక్ కు చార్జింగ్ పెట్టి నిద్రపోగా, అర్ధరాత్రి టైమ్ లో బ్యాటరీ పేలిపోయి చనిపోయాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తాజాగా విజయవాడలోనూ ఓ వ్యక్తి కొత్తగా బండి కొని రాత్రి చార్జింగ్ పెట్టి పడుకోగా, తెల్లవారుజామున బ్యాటరీ పేలడంతో మృతి చెందాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, గత నెల రోజుల్లో దేశ వ్యాప్తంగా 30 దాకా ఎలక్ర్టిక్ వెహికల్స్ కాలిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈవీల కంపెనీలు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లోపాలున్న బండ్లను వెనక్కి రప్పించాలని సూచించారు. ఈవీల ప్రమాదాలపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతుందని చెప్పారు.
కారణాలేంటి?
సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ల్యాప్‌టాప్స్ వంటి వాటిల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలనే కరెంట్ బండ్లలోనూ వాడతారు. అయితే బండ్లలోని బ్యాటరీలు కాలిపోవడానికి నిపుణులు వివిధ కారణాలు చెబుతున్నారు. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టం(బీఎంఎస్)లో లోపాలు ఒక కారణమంటున్నారు. బ్యాటరీ ప్యాక్‌లోని ప్రతి సెల్ టెంపరేచర్‌ను మానిటర్ చేసే బీఎంఎస్ వ్యవస్థ, బ్యాటరీ టెంపరేచర్ ను ఆపరేట్ చేసేందుకు ప్రత్యేక కూలింగ్ సిస్టం ఉండాలి. అయితే వీటి ఖరీదు ఎక్కువ కావడంతో చాలా కంపెనీలు ఈ టెక్నాలజీపై దృష్టి పెట్టడం లేదు. తక్కువ ధరకే వాహనం అందించాలనే పోటీతో నాణ్యత విషయంలో రాజీ పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఉష్ణోగ్రత 50 డిగ్రీల కంటే పెరిగితే లిథియం అయాన్ బ్యాటరీలు తట్టుకోలేవు. మన దగ్గర ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీలు ఉంటాయి. కానీ చార్జింగ్ పెట్టినప్పుడు, ఎండలో వాహనం ఎక్కువ సేపు నిలిపినప్పుడు... టెంపరేచర్ 50 డిగ్రీలు దాటి బ్యాటరీలు పేలిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బండ్ల తయారీలో లోపాలు, వాటి వాడుకపై వాహనదారులకు అవగాహన కల్పించకపోవడం, షార్ట్ సర్క్యూట్ తదితర కూడా ప్రమాదాలకు కారణమంటున్నారు.
ఈ జాగ్రత్తలు అవసరం..
బ్యాటరీలు పేలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒరిజినల్ చార్జర్ ఉపయోగించాలని, పదేపదే చార్జింగ్ పెట్టొద్దని, ఈవీలు హీట్ కాకుండా చూసుకోవాలని, ఎక్కువ సేపు ఎండలో ఉంచొద్దని, బ్యాటరీ డ్యామేజీ లేదా లీకేజీలను గుర్తించాలని, రాత్రి వేళల్లో చార్జింగ్ పెట్టి వదిలేయొద్దని, పరిమితికి మించి చార్జ్ చేయొద్దని సూచిస్తున్నారు.
ఈ-బండ్లకు మస్తు డిమాండ్..
పెట్రో రేట్లు పెరగడం, కరెంట్ బండ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. దీంతో వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. మన రాష్ట్రంలో 2021–-22 ఆర్థిక సంవత్సరంలో 6 వేలకు పైగా వాహనాలు రిజిస్టర్ అయ్యాయని, వాటిలో 70 శాతానికి పైగా టూవీలర్లు ఉన్నాయని రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి.
తయారీ లోపాలే కారణం..
కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించడం లేదు. పోటీ నేపథ్యంలో బండ్లు క్వాలిటీగా రావడం లేదు. తయారీ లోపాలతోనే బ్యాటరీలు పేలిపోతున్నాయి.
- పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్
అవగాహన అవసరం..
ఈవీలను కొనాలని జనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. కానీ వాటిని ఎలా వాడాలో అవగాహన కల్పించడం లేదు. ఇదెంతో ముఖ్యం. అలాగే బ్యాటరీల క్వాలిటీని చెక్ చేశాకే బండ్ల అమ్మకాలకు అనుమతి ఇవ్వాలి.
- షేక్ సలావుద్దీన్, తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్