మంచిర్యాల జిల్లాలో సీఎమ్మార్ .. బకాయిలు రూ.133 కోట్లు

మంచిర్యాల జిల్లాలో సీఎమ్మార్ .. బకాయిలు రూ.133 కోట్లు
  • 20 ​మిల్లులపై ఆర్​ఆర్​ యాక్ట్​,  క్రిమినల్​ కేసులు 
  • కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న 10 మంది మిల్లర్లు 
  • ఆస్తులు బంధువుల పేర్ల మీదికి బదలాయింపు 
  • రికవరీ కోసం సివిల్​ సప్లై అధికారుల తంటాలు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ బకాయిలు భారీగా పేరుకుపోయాయి.   ఏకంగా రూ.133.78  కోట్ల బియ్యం పెండింగ్​లో ఉన్నాయి.  ఏండ్లుగా గడుస్తున్నా సీఎమ్మార్​ ఇవ్వడం లేదు. దీంతో జిల్లాలోని 20 మిల్లులపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్​) ప్రయోగించడంతో పాటు క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. అయినా ఫలితం లేదు. ఈ కేసులను సవాల్​ చేస్తూ దాదాపు 10 మంది మిల్లర్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో సీఎమ్మార్​ రికవరీ చేయడానికి సివిల్​ సప్లై అధికారులు తంటాలు పడుతున్నారు. 

2022 నుంచి పెండింగ్​....

జిల్లాలో 2022-–23 యాసంగి సీజన్​ నుంచి సీఎమ్మార్​ బకాయిలు పేరుకుపోయాయి. ఆ సీజన్​లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడులు రాగా, కేపాసిటీకి మించి మించి మిల్లులకు కేటాయించారు. ఇదే అదునుగా మిల్లర్లు వడ్లను అమ్ముకొని కోట్లలో సొమ్ము చేసుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించిన వడ్లను మిల్లింగ్​ కోసం కేటాయిస్తుంది. ఆ వడ్లను మిల్లింగ్​ చేసి క్వింటాలుకు రూ.68 కిలోల చొప్పున బియ్యం అప్పగించాలి. 

కానీ కొంతమంది మిల్లర్లు వడ్లను పక్కదారి పట్టించగా, మరికొందరు మిల్లింగ్​ చేసి బియ్యం అమ్ముకున్నారు. అప్పటి బీఆర్​ఎస్​ సర్కారు నిర్లక్ష్యం కారణంగా సివిల్​ సప్లై శాఖ అప్పుల్లో కూరుకుపోయింది. కాంగ్రెస్​ గవర్నమెంట్​ అధికారంలోకి వచ్చాక సీఎమ్మార్​ రికవరీపై ఫోకస్​ పెట్టింది. మిల్లర్లకు పలుమార్లు గడువులు ఇచ్చినా బియ్యం అప్పగించకపోవడంతో చివరకు ఆర్​ఆర్​ యాక్టును ప్రయోగించింది. క్రిమినల్​ కేసులు పెట్టింది. 

తప్పించుకునేందుకు యత్నాలు... 

ఆర్​ఆర్​ యాక్ట్ , క్రిమినల్​ కేసుల నుంచి తప్పించుకునేందుకు మిల్లర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 2022-–23 సీజన్​లో మిల్లుల కెపాసిటీకి మించి వడ్లు కేటాయించారని, ఆరుబటయట నిల్వచేయడంతో పాడయ్యాయని, సరిపడా టైం ఇవ్వకుండానే కేసులు పెట్టారని రకరకాల సాకులు చెబుతూ కోర్టును ఆశ్రయించారు. 20 మందిలో దాదాపు 10 మంది మిల్లర్లు స్టే తెచ్చుకొని దర్జాగా తిరుగుతున్నారు. కొంతమంది తమ పరపతి, పలుకుబడి వాడుకొని బడా లీడర్లతో అధికారులపై ప్రెజర్​ తీసుకొస్తున్నారు. 

దీంతో కౌంటర్ కేసులు ఫైల్​ చేయడంలో సివిల్​ సప్లై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు కలెక్టర్​ కుమార్​ దీపక్​ ఆదేశాలతో మిల్లర్ల ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. మిల్లర్లతో పాటు వారి కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఆస్తుల రికవరీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దీంతో మిల్లర్లు వారి ఆస్తులను బంధువుల పేర్ల మీదికి బదలాయిస్తున్నట్టు 
తెలుస్తోంది. 

మిల్లుల వారీగా బకాయిల వివరాలు..

మాతేశ్వరి ఆగ్రో ఇండస్ర్టీస్​ (లక్ష్మీపూర్​,  బెల్లంపల్లి) రూ.6.53 కోట్లు, సోమేశ్వర రైస్​మిల్​ (ఆస్నాద్​, చెన్నూర్​) రూ.5.02 కోట్లు, శ్రీరాజరాజేశ్వర మోడ్రన్​ రైస్​మిల్​ (కత్తెరశాల, చెన్నూర్​) రూ.3.45 కోట్లు, వెంకటరమణ రైస్​మిల్​ (పెద్దపేట, దండేపల్లి) రూ.6.01 కోట్లు, దుర్గా ఇండస్ర్టీస్​ ( నర్సింగాపూర్, హాజీపూర్​) రూ.10.81 కోట్లు, అన్నపూర్ణ ఆగ్రో మోడ్రన్​ రైస్​మిల్​ (కుందారం, జైపూర్​) రూ.3.17 కోట్లు, బీఎస్​వై రా రైస్​మిల్​ (ముదిగుంట, జైపూర్) రూ.19.07 కోట్లు, బాలాజీ ఆగ్రో ఇండస్ర్టీస్​ (టేకుమట్ల, జైపూర్​) రూ.8.32 కోట్లు, సత్యశివ ఆగ్రో ఇండస్ర్టీస్​ (నర్సింగాపూర్​, జైపూర్​) రూ.5.22 కోట్లు, ఈశ్వర ఆగ్రో ఇండస్ర్టీస్​ (ఇందారం, జైపూర్​) రూ.2.56 కోట్లు, మణికంఠ రైస్​మిల్​ (సింగరాయిపేట, జన్నారం) రూ.3.16 కోట్లు, శ్రీలక్ష్మీనర్సింహా మోడ్రన్​ రైస్​మిల్​ (కలమడుగు, జన్నారం) రూ.3.08 కోట్లు, శ్రీవెంకటరమణ ఆగ్రో ఇండస్ర్టీస్​ (కోటపల్లి) రూ.8.33 కోట్లు, జైయోగేశ్వర ఇండస్ర్టీస్​ (కొత్తూర్​, లక్సెట్టిపేట) రూ.9.06 కోట్లు, హనుమాన్​ ఆగ్రో ఇండస్ర్టీస్​ (మంచిర్యాల) రూ.17.77 కోట్లు, నీలం బ్రదర్స్​ మోడ్రన్​ రైస్​మిల్​ (పొన్నారం, మందమర్రి) రూ. 2.04 కోట్లు, శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్​మిల్​ (నందులపల్లి, నెన్నెల) రూ.4.34 కోట్లు, వాసవిమాత ఆగ్రో ఇండస్ర్టీస్​ (రేచిని, తాండూర్​) రూ.15.74 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. 

ఆస్తులు రికవరీ చేస్తాం... 

జిల్లాలో 20 రైస్​ మిల్లులు రూ.133.78 కోట్ల సీఎమ్మార్​ బకాయిలు ఉన్నాయి. వాటి యజమానులపై రెవెన్యూ రికవరీ యాక్ట్​ ప్రయోగించాం. క్రిమినల్​ కేసులు పెట్టాం. పలువురు మిల్లర్లు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. త్వరలోనే కౌంటర్​ ఫైల్​ చేస్తాం. చట్టప్రకారం బకాయిదారుల ఆస్తులను రికరీ చేస్తాం. 

సబావత్​ మోతీలాల్​, అడిషనల్​ కలెక్టర్​ (రెవెన్యూ)