- మాజీ ఎమ్మెల్యే కుటుంబీకుల రైస్ మిల్లుల్లో అధికారుల సోదాలు
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ కుటుంబానికి చెందిన మూడు రైస్‌మిల్లుల్లో సివిల్‌సప్లయ్ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. రూ.70 కోట్ల విలువైన 33,328 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ వడ్లు మాయమైనట్లు అనుమానిస్తున్నారు. ఈ మిల్లులకు 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్లలో 50,732 మెట్రిక్ టన్నుల వడ్లు ఇచ్చారు. టెక్నికల్సమస్యలతో మిల్లులు నడవడం లేదంటూ వడ్లను బోధన్, వర్ని, ఎడపల్లి, పెగడాపల్లిల్లోని ఇతర మిల్లర్లకు తరలించారని సివిల్సప్లయ్ఆఫీసర్లకు మిల్లర్లు చెప్పారు. ఆయా మిల్లర్ల నుంచి తామే సీఎంఆర్ కు అప్పగిస్తామని లెటర్లు తీసుకుని ఆఫీసర్లకు ఇచ్చారు. రెండు సీజన్లకు సంబంధించి 17,404 మెట్రిక్ టన్నుల వడ్ల బాపతు రైస్ మాత్రమే అప్పగించారు. మిగతా 33,328 టన్నులపై చేతులెత్తేశారు.
నాలుగు రోజుల కింద మిల్లులను తనిఖీ చేసిన హైదరాబాద్టాస్క్ఫోర్స్టీమ్.. వడ్ల నిల్వలు లేకపోవడంతో జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చింది. దీంతో శుక్ర, శనివారాల్లో డీఎస్ఓ చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్, తహసీల్దార్ గంగాధర్, డీటీ నిఖిల్రాజ్ తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యే బంధువులు తమకు వడ్లు తరలిస్తున్నట్టు ముందుగానే తమతో లెటర్ల మీద సంతకాలు తీసుకున్నారని, వడ్లు మాత్రం సరఫరా కాలేదని అగ్రిమెంట్ చేసుకున్న మిల్లర్లు అధికారులకు చెప్పారని తెలుస్తోంది. తమ మిల్లులు టెక్నికల్ సమస్యలతో పనిచేయడం లేదని షకీల్ కుటుంబ సభ్యులు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.