వానాకాలం, యాసంగి సీజన్‌కు సంబంధించినకస్టం మిల్లింగ్ (సీఎంఆర్) ఇంతవరకు పూర్తికాలేదు. ప్రభుత్వ పాలసీ, పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం కారణంగా రైస్ మిల్లుల యజమానులు ఖరీఫ్ రైస్ ఇంతవరకు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు. ఈ ఏడాది యాసంగికి సంబంధించిన సీఎంఆర్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. నూక శాతంపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో మిల్లింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
నిర్మల్ జిల్లాలో గత వానాకాలంలో1.28 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం మిల్లింగ్ కోసం సివిల్సప్లై ఆఫీసర్లు 41 రైస్ మిల్లులకు ఇచ్చారు. కానీ.. ఆ ప్రక్రియ ఇంతవరకు పూర్తికాలేదు. మిల్లుల యజమానులు ఇంకా 85.995 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వం రెండుసార్లు గడువు పెంచినా.. రైస్ మిల్లర్లు మాత్రం స్పందించలేదు. యాసంగిలో1.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిర్మల్ జిల్లాలోని 32 రైస్ మిల్లులకు ఇవ్వడంతోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలోని మిల్లులకు కేటాయించారు. అయితే జిల్లాలోని 32 రైస్ మిల్లులకు ఇచ్చిన 98,776 మెట్రిక్‌టన్నుల ధాన్యంలో 66,180 మెట్రిక్ టన్నుల బియ్యం పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. ధాన్యం సేకరణపై జాప్యం జరగడం.. నూక శాతం నిర్ధారణ కాకపోవడం.. నష్టపరిహారంపై అభ్యంతరాలు రావడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల యాసంగి ధాన్యంలో నూక శాతం నిర్ధారించేందుకు బెంగళూరుకు చెందిన నిపుణులను కూడా జిల్లాకు పంపింది. వీరు దాదాపు ఐదు రోజులపాటు అన్ని మిల్లులో మిల్లింగ్ పరిశీలించి నూక శాతం నిర్ధారించారు. నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. అయినా ఇప్పటి వరకు నూకశాతంపై స్పష్టత రాలేదు. దీంతో ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అయితే మరోవైపు రైస్ మిల్లుల్లో ధాన్యం నిలువలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. మరోవైపు మిల్లింగ్ ప్రక్రియ ఎప్పటివరకు పూర్తవుతుందనే విషయంపై సివిల్ సప్లై ఆఫీసర్లు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
గందరగోళంగా ధాన్యం లెక్కలు
వానాకాలం ధాన్యం లెక్కలపై ఇప్పటివరకు స్పష్టత లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ధాన్యం సేకరణ పూర్తికాగానే సివిల్ సప్లై ఆఫీసర్లు సంబంధిత రైస్ మిల్లులకు సీఎంఆర్ కోసం ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అయితే ఏ సీజన్ కు సంబంధించిన ధాన్యం ఆ సీజన్ లో సీఎంఆర్ మిల్లింగ్ పూర్తి కాకపోవడంతో సమస్య జఠిలమవుతోంది. ఇదే అదునుగా కొందరు అవినీతికి తెరలేపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో సీఎంఆర్ ధాన్యం నిలువల లెక్కలపై ఉన్నత స్థాయి విచారణ కూడా జరిగింది. ఇటీవల బెంగళూకు చెందిన నిపుణులు ధాన్యం పరిశీలించి వెళ్లినా ఇంతవరకు నూకశాతంపై స్పష్టత రాలేదు. ఫలితంగా సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. మిల్లింగ్ కోసం ప్రభుత్వం ప్రతిసారీ గడువు పెంచుతుండడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం రైస్ మిల్లులలో పేరుకుపోయిన ధాన్యం ఏ సీజన్ కు సంబంధించినదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
త్వరలో సీఎంఆర్ పూర్తి...
నూక శాతం నిర్ధారణపై ఆదేశాలు వెలువడగానే రబీ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన మిల్లింగ్ ప్రక్రియ చివరిదశలో ఉంది. త్వరగా పూర్తిచేయాలని రైస్‌మిల్లర్లను ఆదేశించారు. పారా బాయిల్డ్మిల్లింగ్ప్రక్రియ కొనసాగుతోంది.
-శశికళ, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్