వడ్లు తీసుకుని బియ్యమిస్తలేరు

  • వానాకాలం, యాసంగివే 12.19 లక్షల టన్నుల బియ్యం అప్పగించని మిల్లర్లు 

కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్​(సీఎంఆర్) ధాన్యం  పక్కదారి పడుతోంది.  సివిల్ సప్లై  నుంచి  ధాన్యం తీసుకుంటున్న వ్యాపారులు.. దాన్ని మార్కెట్ లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.   ఎఫ్ సీఐకి, సివిల్ సప్లై శాఖకు బియ్యం అప్పగించాల్సి వచ్చినప్పుడు రేషన్ బియ్యం సేకరించి, రీసైక్లింగ్ చేసి ఇస్తున్నారు.   హైదరాబాద్ నుంచి సివిల్ సప్లయీస్ శాఖ టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్లు తనిఖీ చేసే వరకు జిల్లా ఆఫీసర్లకు ఇక్కడి మిల్లుల్లో ధాన్యం మాయమైన వ్యవహారం తెలియడం లేదు.  ఆఫీసర్లు, లీడర్ల కనుసన్నల్లోనే సీఎంఆర్ దందా నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఆర్నెళ్లలో ఇవ్వాల్సిన బియ్యం రెండేళ్లయినా ఇవ్వట్లే..

 సీఎంఆర్ కింద సివిల్ సప్లయీస్ శాఖ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని వారు ఆర్నెళ్లలోనే బియ్యంగా మార్చి ఎఫ్​ సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఏడాది, రెండేళ్లు దాటినా మిల్లర్లు టార్గెట్ ను చేరుకోలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో గతేడాది వానాకాలంలో మొత్తం 11,47,754 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 250 మిల్లులకు పంపించారు. ఇందులో 67 శాతాన్ని బియ్యంగా మార్చి ఎఫ్ సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. 7.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉండగా ఇప్పటివరకు 2.46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 5,88,803 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది.  

యాసంగిలో మొత్తం 12,76,005 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించగా 8.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకు 1.89 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్ సీఐకి అప్పగించారు. యాసంగికి సంబంధించి ఇంకా 6,30,397 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. మొత్తంగా 2022 –23 సంవత్సరంలో వానాకాలం, యాసంగి కలిపి 12.19 లక్షల టన్నుల బియ్యం బకాయిపడ్డారు. కలెక్టర్లు తరచూ నోటీసులు పంపిస్తున్నా వారు లెక్క చేయడం లేదు. 

ఫైన్లు వేసినా లెక్క చేయట్లే. 

  2021 వానాకాలానికి సంబంధించిన బియ్యంలో  సగం వరకు ఇప్పటికీ ఎఫ్ సీఐకి చేరలేదు. ఈ ఏడాది మార్చి 31 నాటికి 58 మిల్లులు 3.43 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉందని తేలింది.  ఈ ఆలస్యానికి  125  శాతం ఫైన్ తో 4.29 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో గడిచిన మూడు నెలల్లో 1.59 లక్షల టన్నుల బియ్యం ఇచ్చారు. ఇంకా 2.69 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఫైన్ పెరుగుతుందని తెలిసినా మిల్లర్లు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

హుజురాబాద్ లో వరుస దాడులు..

హుజురాబాద్ మండలంలో నెల రోజుల కాలంలో పలుమార్లు విజిలెన్స్ అధికారులు మిల్లులపై దాడులు నిర్వహించారు. గోమాత, లక్ష్మీ గణపతి, బోర్నపల్లిలోని సాయి ట్రేడర్స్, రాంపూర్ లోని తిరుమల ఇండస్ట్రీ మిల్లుల్లో ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. లక్ష్మీగణపతిలో 3,815 ధాన్యం బస్తాలు వ్యత్యాసం ఉన్నాయి.   ఇందులో 500  బియ్యం బస్తాలను గుర్తించారు. వాటిని పీడీఎస్ రైస్ గా అనుమానించి శాంపిల్ లాబ్ కి పంపారు. మహాలక్ష్మి, వరుణ్ రైస్ మిల్లు ల్లో భారీగా తేడాలు గుర్తించి సీజ్ చేశారు. 

పట్టించుకోని జిల్లా ఆఫీసర్లు.. 

జిల్లాలో జరుగుతున్న రైస్ మిల్లింగ్ పై  సివిల్ సప్లయీస్ ఆఫీసర్ల పర్యవేక్షణ కరువైంది.  ఇదే అదనుగా చాలా మంది మిల్లర్లు గ్రామాలు, పట్టణాల నుంచి ఏజెంట్ల ద్వారా రేషన్ బియ్యాన్ని సేకరిస్తూ వాటినే రీసైక్లింగ్ చేసి.. మళ్లీ ఎఫ్ సీఐకి అప్పగిస్తున్నారు. రెండు నెలల క్రితం ఇలా జమ్మికుంట రైస్ మిల్లు నుంచి పంపిన రెండు లారీల రీసైక్లింగ్ రేషన్ బియ్యాన్ని ఎఫ్ సీఐ ఆఫీసర్లు వెనక్కి పంపడం చర్చనీయాంశమైంది. సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు బయట అమ్ముకుని క్యాష్ చేసుకుంటున్నారని, ఆ తర్వాత నెమ్మదిగా రీసైక్లింగ్ బియ్యాన్ని ఎఫ్ సీఐకి అంటగడుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.