- డిఫాల్ట్ లిస్ట్‌లో 42 మిల్లులు
- 1.70 లక్షల టన్నుల ధాన్యం పక్కదారి
- 21 మిల్లులపై క్రిమినల్ కేసులు
- ఆస్తుల జప్తుకు రెడీ అవుతున్న ఆఫీసర్లు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ పక్కదారి పట్టింది. ఆయా సీజన్లలో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని అధికారులు రైస్‌మిల్లులకు అప్పగించారు. వడ్లను మిల్లింగ్ చేసి నిబంధనల ప్రకారం బియ్యాన్ని ఎస్సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు చాలా కాలంగా పెండింగ్‌లో పెట్టారు. ఇటీవల మిల్లులను తనిఖీ చేసిన అధికారులకు చాలాచోట్ల ధాన్యం స్టాక్ కనిపించలేదు.
Also Read:-తొక్కిసలాటకు నేను బాధ్యుడ్ని కాదు: హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
2023–-24 వానా కాలం,యాసంగి సీజన్లకు సంబంధించి దాదాపు రూ. 708 కోట్ల విలువైన బియ్యం గాయబ్ అయినట్లు గుర్తించారు. బియ్యం రికవరీకి చర్యలు ప్రారంభించిన అధికారులు.. అవసరమైతే ఆర్ఆర్ యాక్టు ప్రయోగించి మిల్లర్లు ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
గడువులు పొడిగించినా.. నో రెస్పాన్స్
జిల్లాలో మొత్తం 243 రైస్ మిల్స్ ఉండగా, అందులో 182 రా రైసు మిల్లులు, 61 పారా బాయిల్డ్ మిల్స్ఉన్నాయి. ఈ మిల్లులకు 2023–-24 వానాకాలంలో 4.75 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో లో 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సర్కారు అప్పగించింది. రెండు సీజన్లు కలిపి 6.25 టన్నుల బియ్యం గవర్నమెంట్‌కు ఇవ్వాల్సిఉండగా 4.55 లక్షల టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 1.70 లక్షల టన్నుల బకాయి ఉంది. సీఎంఆర్ రైస్ అప్పగించేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు చాలాసార్లు పొడిగించినా ఫలితం లేదు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు గడువు పెంచారు. తాజాగా విధించిన గడువు కూడా ఈనెల 15న ముగుస్తోంది. ఈసారి గడువు పొడిగింపు ఉండదని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. నాలుగు రోజుల గడువు మాత్రమే ఉన్నా మిల్లర్లు బకాయి పడిన రైస్‌ను అప్పగించేందుకు ముందుకురావడంలేదు.
708 కోట్ల వడ్లు మాయం
జిల్లాలోని 243 రైసు మిల్లుల్లో 42 మందిని డిఫాల్టర్లుగా అధికారులు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్స్మిల్లుల్లో స్టాక్ తనిఖీ చేశాయి. బియ్యాన్ని అప్పగించకపోవడం, సెంటర్ల నుంచి తరలించిన వడ్లు లేకపోవడంతో సీరియస్ అయ్యారు. 42 మంది మిల్లర్లు సుమారు రూ.708 కోట్ల సీఎంఆర్ వడ్లు మాయం చేసినట్టు అధికారులు లెక్క తేల్చారు. వీరిలో 21 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. మిగిలిన 21 మందికి ఫైనల్ నోటీసు ఇచ్చారు.
నిబంధనలు కఠినం
సీఎంఆర్వంద శాతం రాబట్టే విషయంలో సీరియస్‌గా ఉన్నం. కస్టం మిల్లింగ్నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. డీఫాల్టర్ లిస్టులో ఉన్నవాళ్లు బకాయి రైస్ అప్పగించకుంటే వారికి తిరిగి వడ్లు కేటాయించం. గడువులోగా బియ్యం ఇవ్వకుంటే ఆర్ఆర్ యాక్ట్ కింద తహసీల్దార్లు చర్యలు తీసుకుంటారు. ఆస్తులు సీజ్ చేసి వేలం వేస్తం. ఈ సీజన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు సీఎంఆర్ అప్పగించేలా మిల్లుల్లో ఏర్పాట్లు చేశారు. - అంబాదాస్ రాజేశ్వర్, డీఎం, సివిల్ సప్లై