మిల్లుల్లో కనిపించని సీఎంఆర్‌‌

మిల్లుల్లో కనిపించని సీఎంఆర్‌‌
  • సూర్యాపేట జిల్లాలో 8 మిల్లుల్లో రూ.515 కోట్ల బియ్యం పక్కదారి

సూర్యాపేట, వెలుగు : కస్టమ్‌‌ మిల్లింగ్‌‌ రైస్‌‌ ఇవ్వకుండా సూర్యాపేట జిల్లా మిల్లర్లు మొండికేస్తున్నారు. జిల్లాలో కోట్ల విలువైన సీఎంఆర్‌‌ పక్కదారి పట్టిందన్న ఆరోపణలు రావడంతో టాస్క్‌‌ఫోర్స్‌‌, సివిల్‌‌ సప్లై ఆఫీసర్లు కలిసి దాడులు చేస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది మిల్లుల్లో సుమారు రూ.515 కోట్ల విలువైన సీఎంఆర్‌‌ పక్కదారి పట్టినట్లు తేల్చారు. వీటిలో అత్యధికంగా 2022–23 రబీ సీజన్‌‌కు సంబంధించిన రైస్‌‌ ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. దీంతో జరిమానాతో కలిసి వసూలు చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు. 

సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా రైస్‌‌ మిల్లర్ల అసోసియేషన్‌‌ జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్యకు చెందిన శ్రీసంతోషి రైస్‌‌ మిల్‌‌లో 2022–23 రబీకి సంబంధించి రూ.63.17 కోట్ల విలువైన 18,145 టన్నులు, 2023–24 ఖరీఫ్‌‌కు సంబంధించి రూ.47.19 కోట్ల విలువైన 12,247 టన్నుల సీఎంఆర్‌‌ మాయమైనట్లు తేలింది.

 తిరుమలగిరికి చెందిన హర్షిత రైస్‌‌ కార్పొరేషన్‌‌లో రూ. 10.91 కోట్ల విలువైన 2,994 టన్నులు, గడ్డిపల్లి ఎంకేఆర్‌‌ రైస్‌‌మిల్లులో రూ. 36.18 కోట్ల విలువైన 9,730 టన్నులు, రఘురాం ఇండ్రస్ట్రీస్‌‌లో రూ. 100.5 కోట్ల విలువైన 27,091 టన్నులు, లక్ష్మీ ట్రేడర్స్‌‌లో రూ. 16.4 కోట్ల విలువైన 4,466 టన్నులు, శ్రీ సంతోషిమా పార్‌‌బాయిల్డ్‌‌ మిల్లులో రూ. 64.87 కోట్ల విలువైన 17,801 టన్నులు, శ్రీవేంకటేశ్వర రైస్‌‌ ఇండస్ట్రీలో రూ. 70.95 కోట్ల విలువైన 19,436 టన్నులు, తిరుమల రైస్‌‌ కార్పొరేషన్‌‌లో రూ. 82.57 కోట్ల విలువైన 22,366 టన్నుల సీఎంఆర్‌‌ మాయమైనట్లు తేలింది.

కోర్టును ఆశ్రయించడంతో నిలిచిన చర్యలు

సూర్యాపేట జిల్లాలో పెండింగ్ సీఎంఆర్‌‌ విషయంలో ఆఫీసర్ల చర్యలు ముందుకు సాగడం లేదు. మొత్తం 8 మిల్లుల్లో రూ. 515 కోట్ల సీఎంఆర్‌‌ పెండింగ్‌‌లో ఉండడంతో గతంలో నోటీసులు ఇవ్వడంతో పాటు ఇద్దరిని అరెస్ట్‌‌ చేశారు. మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. 

అయితే  వీరిలో ముగ్గురు మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. అయితే వారు హైకోర్ట్‌‌ను ఆశ్రయించడంతో తదుపరి చర్యలు నిలిచిపోయాయి. మిల్లర్లు కోర్టులను ఆశ్రయిస్తుండడంతో రికవరీ ఇబ్బందిగా మారింది. రికవరీ వదిలి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు.