బ్యాంక్ మేనేజర్​ను పొట్టుపొట్టు కొట్టిండు

బ్యాంక్ మేనేజర్​ను పొట్టుపొట్టు కొట్టిండు
  • ఫిక్స్​డ్​ డిపాజిట్​పై ట్యాక్స్ కట్ చేసినందుకు కస్టమర్ దాడి
  • గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ఘటన 

న్యూఢిల్లీ: ట్యాక్స్ విషయంలో డిసప్పాయింట్ అయిన ఓ కస్టమర్ బ్యాంకుకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. తాను చేసిన డిపాజిట్ డబ్బులపై ట్యాక్స్  ఎలా కట్ చేస్తావంటూ బ్యాంక్ మేనేజర్​ను చితకబాదాడు. గుజరాత్​రాష్ట్రం అహ్మదాబాద్ లోని వస్త్రాపూర్ యూనియన్ బ్యాంక్​లో ఈ ఘటన జరిగింది. తన ఫిక్స్​డ్ డిపాజిట్ పై ట్యాక్స్ వేయడంతో కస్టమర్ జైమన్ రావల్ తీవ్ర నిరాశతో బ్యాంకుకు వచ్చాడు. ఈ విషయం గురించి బ్రాంచి మేనేజర్​తో వాగ్వాదానికి దిగాడు. కాసేపట్లోనే వాగ్వాదం కాస్త కొట్లాటదాకా వెళ్లింది.

 కోపం పట్టలేక బ్రాంచి మేనేజర్​పై రావల్ దాడి చేశాడు. ఇద్దరూ గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. వెంట వచ్చిన రావల్ తల్లి, మిగతా సిబ్బంది వారిని విడిపించారు. అదే కోపంలో రావల్ మరో సిబ్బందితోనూ ఘర్షణపడ్డాడు. ఓ నిమిషంపాటు జరిగిన ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

లోన్ ఇయ్యకపోతే నీ అంతు చూస్తా.. 

తనకు లోన్ సాంక్షన్ చేయలేదని ఓ కస్టమర్ బ్యాంకు మేనేజర్​ను బెదిరించాడు. బ్యాంకుకు వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పాట్నాలోని కెనరా బ్యాంక్ బ్రాంచి మేనేజర్ లోన్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ కస్టమర్ బ్యాంకుకు వెళ్లి ఆమెపై అరవడం ప్రారంభించాడు. లోన్ ఇవ్వకుంటే తన ప్రతాపమేంటో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన బెదిరిస్తుండగా వీడియో తీస్తున్న మేనేజర్ దగ్గరకు వెళ్లిన కస్టమర్.. ‘వీడియో తీసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా’ అంటూ ఫోన్ గుంజుకుని నేలకేసి కొట్టాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.