ఈ నగరానికి ఏమైంది: బిర్యానీలో బొద్దింకలు.. కస్టమర్లకు వాంతులు

ఈ నగరానికి ఏమైంది: బిర్యానీలో బొద్దింకలు.. కస్టమర్లకు వాంతులు

హైదరాబాద్ హోటళ్లకు ఏమైంది.. బిర్యానీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న హైదరాబాద్ లో హోటళ్లకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనల వల్ల ప్రతి ఒక్కరిలో ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొన్నటిదాకా హైదరాబాద్ బిర్యానీ పేరు చెబితేనే నోరూరిన జనాలకు ఇప్పుడు హోటళ్లలో బిర్యానీని తలుచుకుంటేనే వాంతి చేసుకునే పరిస్థితి దాపురించింది. ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలే ఇందుకు కారణం. మొన్న హైదరాబాద్ లోని కేపీహెచ్బీ లో ఓ టిఫిన్ సెంటర్లో చట్నీతో బొద్దింకలు వచ్చిన ఘటన మరువక ముందే అల్వాల్ లోని ఓ హోటల్లో బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చిన ఘటన ఫుడ్ లవర్స్ ను కలవర పెడుతోంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. అల్వాల్ లోని యతి హౌస్ హోటల్  లో బిర్యానీ లో బొద్దింకలు దర్శనమిచ్చిన ఘటన కస్టమర్లను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. బిర్యానీ తింటున్న సమయంలో బొద్దింకలు ప్రత్యక్షం కావడంతో హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కస్టమర్లు. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని బుకాయించింది యాజమాన్యం. దీంతో కస్టమర్లు  కిచెన్ లో ఉన్న ఫ్రిజ్లో చూడగా..  గోంగూర పచ్చడి, చికెన్ లెగ్ పీస్ లలో బూజు పట్టి ఉన్నట్లు గుర్తించారు. 

బిర్యానీ తిన్న వెంటనే కస్టమర్లకు ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే నాణ్యత లేని ఆహారాన్ని విక్రయిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కస్టమర్లు. ఇటీవల లోతుకుంట లోని గ్రిల్ హౌస్ లో షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటన మరువక ముందే అల్వాల్లో బిర్యానీలో బొద్దింకలు రావడంతో కస్టమర్లు హోటల్లో ఆహారం తినాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.