3 వేల బిల్లుకు 8 లక్షల టిప్పు.. ఊడిన ఉద్యోగం

న్యూయార్క్: అమెరికాలోని ఓ రెస్టారెంట్ వెయిట్రస్​కు 10 వేల డాలర్ల టిప్ ఇచ్చి కస్టమర్ సర్ ప్రైజ్ ఇవ్వగా.. వారం తర్వాత ఇక పనిలోకి రావొద్దంటూ మేనేజ్ మెంట్ షాకిచ్చింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలనేది పూర్తిగా బిజినెస్ పరమైన నిర్ణయమేనని, దీనికి ఆ భారీ టిప్ కు సంబంధంలేదని వివరణ ఇచ్చింది. దీంతో ఊహకందనంత టిప్ దక్కిందన్న సంతోషం వారంలోనే ఆవిరైపోయిందంటూ సదరు వెయిట్రస్ వాపోయింది.

అసలేం జరిగిందంటే..

మిషిగాన్ రాష్ట్రం బెంటన్ హార్బర్ కు చెందిన లిన్సే బోయడ్ స్థానికంగా ఉన్న ‘ది మాసన్ జార్ కేఫ్’ లో వెయిట్రస్ గా పనిచేస్తోంది. ఇటీవల ఓ కస్టమర్ ఆమెకు భారీ మొత్తంలో టిప్ ఇచ్చాడు. ఆయన తిన్నదానికి 30.24 డాలర్ల (సుమారుగా రూ.2,600) బిల్లు కాగా ఆ మొత్తానికి 10 వేల డాలర్లు (దాదాపు రూ.8 లక్షలకు పైగా) టిప్పుగా ఇచ్చాడు. తనకు ప్రియమైన వ్యక్తి ఒకరు చనిపోయారని, ఆమె గుర్తుగా ఈ టిప్ ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ మొత్తాన్ని వెయిటర్లు అంతా సమానంగా పంచుకోవాలని సూచించాడు. దీంతో లిన్సే సంతోషం పట్టలేకపోయింది. కస్టమర్ చెప్పినట్లుగానే 9 మంది వెయిటర్లు ఆ టిప్ ను సమానంగా పంచుకోగా.. తలా 1100 డాలర్లు (రూ.91,000) వచ్చింది.

వారం రోజులు గడిచాక తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మేనేజ్ మెంట్ చెప్పడంతో షాక్ కు గురయ్యానని లిన్సే పేర్కొంది. ఈ విషయాన్నంతా తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకొచ్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో మాసన్ జార్ కేఫ్ మేనేజ్ మెంట్ కూడా సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. లిన్సే ను తొలగించడానికి, ఆమె అందుకున్న టిప్ కు సంబంధంలేదని పేర్కొంది. అయితే, లిన్సేను తొలగించడానికి అసలు కారణం ఆ టిప్ రేపిన చిచ్చేనని తెలుస్తోంది. కస్టమర్ ఇచ్చిన టిప్​లో తమకూ వాటా ఇవ్వాలంటూ ఆ రోజు డ్యూటీలో లేని వెయిటర్లు కూడా గొడవ చేశారట. ఇది కాస్తా ముదిరి లిన్సే ఉద్యోగానికి ఎసరు పెట్టిందట.