డ్వాక్రా సొమ్ము స్వాహా.. కామారెడ్డి జిల్లాలో ఐకేపీ సిబ్బంది చేతివాటం

కామారెడ్డి , వెలుగు:  స్వయం సహాయక సంఘాల మహిళలు(డ్వాక్రా) పొదుపు చేసి  దాచుకున్న సొమ్ముతో పాటు,   లోన్లు తీసుకొని తిరిగి చెల్లించే  పైసలు,  వడ్డీ రాయితీ డబ్బులు కామారెడ్డి జిల్లాలో స్వాహా అవుతున్నాయి.  ఐకేపీలో పనిచేసే కొందరు సిబ్బందితో పాటు, కొంతమంది బ్యాంక్​ కస్టమర్​పాయింట్​ నిర్వాహకులు మహిళ సంఘాల  పైసల్ని  తమ సొంతానికి వాడుకుంటున్నారు.  నెలల తరబడి ఈ వ్యవహారం సాగుతోంది.  ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడం, ఐకేపీలో కింది స్థాయిలో పనిచేసే సిబ్బందిపై  మహిళల నమ్మకంతో  అక్రమాలు  చోటు చేసుకుంటున్నాయి.  పైసలు పక్కదారి పట్టాయని తెలిసి  బాధిత  మహిళా సంఘాలు  రోడెక్కుతున్నాయి.  

 జిల్లాలో  16,941 స్వయం సహాయక సంఘాలు.. 

జిల్లాలో  16,941 స్వయం సహాయక సంఘాలు ఉండగా ఇందులో  1,74,091 మంది మెంబర్లు ఉన్నారు.  12,593 సంఘాలు బాగా యాక్టివ్​గా ఉండి ఏ గ్రేడ్​లో  ఉన్నాయి.  సభ్యులు ప్రతి నెలా పొదుపుగా జమ చేసుకునే పైసలు, బ్యాంక్ లింకేజీ,  గ్రామ సంఘాల ద్వారా, స్ర్తీనిధి ద్వారా  సభ్యులకు లోన్లు ఇస్తున్నారు.  క్షేత్రస్థాయిలో  సీసీలు, వీవోఏలు  అకౌంట్స్​ పర్యవేక్షిస్తుంటారు.  మండల స్థాయిలో ఏపీవో ఉంటారు.  2022–-23 ఆర్థిక ఏడాదిలో   స్ర్తీ నిధి ద్వారా రూ.  59.95 కోట్లు,  వడ్డీ సబ్సిడీ కింద  రూ.13.60 కోట్లు,  బ్యాంక్​ లింకేజీ ద్వారా 12,231 సంఘాలకు రూ.714 కోట్ల లోన్లు ఇచ్చారు. 

 ప్రతి నెలా సక్రమంగా  లోన్లు చెల్లించే సంఘాలకు  వచ్చే ఏడాది ఇచ్చే లోన్ అమౌంట్​ పెరుగుతుంది.  సంఘాల్లో  సభ్యులుగా ఉండే మహిళల్లో చాలా మంది నిరక్షరాస్యులు కాగా  మరికొందరు  కొంత మేర చదువుకున్న వారు ఉన్నారు.  ఆర్థిక లావాదేవీల వ్యవహారాలపై వారికి సరైన అవగాహన లేకపోవటం,  సిబ్బందిపై నమ్మకంతో పాటు, ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో   కొన్నిచోట్ల  క్షేత్ర స్థాయిలో పనిచేసే ఐకేపీ సిబ్బంది సంఘాల పైసల్ని స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆడిటింగ్​లో కూడా బయటపడకుండా  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాడ్వాయి, నాగిరెడ్డిపేట, నస్రుల్లాబాద్ మండలాల్లో  అక్రమాలు  ఎక్కువగా జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు  తగిన చర్యలు తీసుకొని పైసలు రికవరీ చేయాలని  మహిళా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.   

 నిజాంసాగర్​ మండలంలో

నిజాంసాగర్​ మండలంలో ని ఆయా గ్రామాల మహిళ సంఘాలు తీసుకున్న లోన్ల అమౌంట్, పొదుపు డబ్బులను ప్రతి నెలా  బ్యాంక్​  కస్టమర్​ సర్వీస్​ పాయింట్​( సీఎస్​పీ) లో ఏడాది కాలంగా  చెల్లించారు. సీఎస్​పీలో చెల్లించిన పైసలు బ్యాంక్​ అకౌంట్లలో జమ కాలేదు.  కొన్నాళ్ల తర్వాత ఈ వ్యవహారం బయటకు వచ్చింది.  ఉన్నతాధికారులకు ప్రతినిధులు  ఫిర్యాదు చేయటంతో ఎంక్వైరీ చేశారు. రూ. 21 లక్షల వరకు మహిళ సంఘాల పైసలు  పక్కదారి పట్టాయి.   రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఈ పైసలు కలెక్షన్​ చేయాలని  ఆఫీసర్లను కలెక్టర్​ ఆదేశించారు.  తమ పైసలు ఇప్పించాలని  ఇక్కడి మహిళలు మండల ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు. 

వెలుగులోకి వచ్చిన అక్రమాలు 

తాడ్వాయి మండం నందివాడలో  రూ.36  లక్షల ఫండ్స్​ పక్కదారి పట్టినట్లు ఇటీవల బయటపడింది. ఈ డబ్బులను  సీసీ తన సొంతానికి  వాడుకున్నట్లు  తేలింది.  అయితే తాను  రూ. 16 లక్షలు మాత్రమే తీసుకున్నానని, వీటిని తాను చెల్లిస్తానని ఆఫీసర్లకు సీసీ విన్నవించారు. సీసీ నుంచి  పైసలు రికవరీ చేయాలని డిమాండ్​ చేస్తూ  మహిళ సంఘాలు ఆందోళన నిర్వహించాయి.  కలెక్టరేట్​ఎదుట వారం రోజుల  క్రితం ధర్నా చేసి  ఆఫీసర్లకు వినతి పత్రం అందించారు.   4 రోజుల క్రితం సీసీ ఇంటి ఎదుట కూడా ఆందోళన నిర్వహించారు. మరి మిగితా డబ్బులు ఎవరు మింగారనేది బయటపడాల్సి ఉంది.