
ర్యాపిడో బైక్ టాక్సీ... ఈ యాప్ గురించి తెలియనివారు ఉండరు.. ముఖ్యంగా వైజాగ్, హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉండేవారు కచ్చితంగా ఒకసారైనా ఈ యాప్ వాడి ఉంటారు అనటంలో అతిశయోక్తి లేదు. చాలామంది నిరుద్యోగులు తమ రోజువారీ ఖర్చు కోసం ఇలాంటి యాప్స్ లో రైడ్స్ చేస్తూ సంపాదిస్తుంటారు..అలాంటోళ్లకు ఇదో చక్కటి ఆదాయ మార్గం అని చెప్పాలి. ఇటీవల వైజాగ్ లో జరిగిన ఈ సంఘటన తెలిస్తే.. లిఫ్ట్ ఇవ్వాలంటేనే కాదు.. ర్యాపిడో రైడర్స్ కూడా భయపడతారు. ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న ఓ వ్యక్తి రైడర్ ను బెదిరించి డబ్బులు దోచుకున్న ఘటన వైజాగ్ లో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..
విశాఖలోని శ్రీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర రాపిడో బుక్ చేసుకున్నాడు మణికంఠ అనే వ్యక్తి.. రైడ్ స్టార్ట్ అయ్యి బైక్ కణితి స్మశాన వాటిక సమీపంలోకి వెళ్ళగానే బైక్ ఆపమన్నాడు సదరు వ్యక్తి. అంతే రైడర్ వాహనాన్ని ఆపగానే.. రైడర్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. రైడర్‌పై దాడి చేసి ఫోన్ పే ద్వారా 48వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని పరారయ్యాడు కేటుగాడు.
కష్టపడి ర్యాపిడో రైడ్స్ చేసి దాచుకున్న సొమ్మంతా కేటుగాడు దోచుకోవడంతో.. లబోదిబోమన్నాడు బాధితుడు. చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విశాఖ పోలీసులు. ఫోన్ పే నంబర్ ఆధారంగా నిందితుడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈ ఘటన ర్యాపిడో రైడర్స్ కి ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి.. వచ్చే జీతాలు సరిపోక, సరైన ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడేవారు రోజువారీ ఖర్చుల కోసం ర్యాపిడో రైడ్స్ చేసుకుంటూ బతుకుతుంటారు. విశాఖ ఘటనతో ర్యాపిడో రైడర్స్ లో భయం మొదలైంది.. బతుకుతెరువు కోసం ర్యాపిడో రైడ్స్ చేసుకుంటున్న తమకు ఈ కొత్త కేటుగాళ్ల బెడద ఏంటి భగవంతుడా అని వాపోతున్నారు రైడర్స్.