హరితహారం పైసల కోసం జీతాల్లో కోతలు

  • స్టూడెంట్లనూ వదలని సర్కారు
  • ప్రజా ప్రతినిధులకు తప్పని వాత
  • ఏటా ఏప్రిల్ లో శాలరీలు. ఫీజుల్లో నుంచి గ్రీన్ ఫండ్ పేరిట కటింగ్
  • కాంట్రాక్టులు, రిజిస్ట్రేషన్లలోనూ ‘హరిత’ బాదుడు
  • నిర్బంధ వసూళ్లను వ్యతిరేకిస్తున్న వర్గాలు

తెలంగాణలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమానికి కావాల్సిన నిధుల సేకరణకు రాష్ట్ర సర్కారు సరికొత్త ప్లాన్ వేసింది. ప్రభుత్వోద్యోగులు, స్టూడెంట్స్​, ప్రజాప్రతినిధులు, టీచర్లు అనే తేడా లేకుండా అన్ని వర్గాల నుంచి గ్రీన్​ఫండ్ పేరుతో నిర్బంధ చందాలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ఏప్రిల్ ​నుంచే ఆయా వర్గాల జీతభత్యాలు, ఫీజుల్లోంచి కట్​ చేసి  హరితనిధికి జమ చేయాలని ఆయా శాఖల అధికారులకు ఫిబ్రవరిలోనే ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు, ప్రతి కాంట్రాక్టు, ప్రతి రిజిస్ట్రేషన్లలోనూ గ్రీన్​ఫండ్​ పేరిట అదనపు చార్జీలు వసూలు చేయబోతున్నారు. ఈ నెల నుంచే శాలరీల్లో కటింగ్​ పెట్టనుండగా, ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమను సంప్రదించకుండా శాలరీలు కట్​చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నారు. 

పెద్దపల్లి, వెలుగు :  ఈ ఫిబ్రవరిలో హరితనిధి కోసం సర్కారు ఒక జీఓ ఇచ్చింది. అందులో విద్యార్థులు , ప్రజాప్రతినిధులు, ఆల్​ ఇండియా సర్వీస్ ​ఆఫీసర్లు, గెజిటెడ్​, నాన్ ​గెజిటెడ్​ ఎంప్లాయీస్​, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులు, వ్యాపార రంగాల వారు, కాంట్రాక్టర్లు గ్రీన్​ ఫండ్​ కట్టాలని పేర్కొన్నారు. ప్రతి యేడు ఏప్రిల్​లో ఉద్యోగుల శాలరీ నుంచి ఈ గ్రీన్​ ఫండ్​ కట్​ చేయాలని ఆర్డర్స్​ ఇచ్చారు. అలాగే విద్యార్థులు కట్టే ఫీజులతో పాటు హరితనిధిని కూడా కలెక్ట్ చేయాలని జీఓలో పేర్కొన్నారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న హరితహారం 2015 నుంచి సాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం.. సొంత నిధులు, కేంద్ర ప్రభుత్వ ఫండ్స్​తో పాటు ఇతర కార్పొరేట్ ​సంస్థల సౌజన్యంతో హరితహారం కొనసాగించింది.  అప్పులతో క్రమంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుండడంతో ఆ భారం నిర్భంధ హరితనిధి వసూళ్ల ద్వారా పూడ్చుకోవడానికి ప్రణాళికలు రూపొందించింది.  
అన్ కండీషనల్​గా గ్రీన్​ఫండ్​ జీఓ
హరితనిధి కోసం ఏర్పాటు చేసిన గ్రీన్​ఫండ్ ​విషయం గురించి ఎవరితో చర్చించకుండానే అధికారులు జీఓ ఇచ్చారు. స్టేట్​వైడ్​ గ్రీనరీ కోసం ఎవరెవరు ఎంత విరాళం ఇవ్వాలో తెలియజేస్తూ ఫిబ్రవరిలోనే ఫైనాన్స్​ సెక్రెటరీ శ్రీదేవి ఆయా డిపార్ట్​మెంట్లకు జీఓ జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని చాలా వరకు స్పాన్సర్​షిప్​ మీదనే నెట్టుకొస్తున్నది.

పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో సింగరేణి, ఎన్టీపీసీ లాంటి సంస్థలు ఖర్చును భరిస్తున్నాయి. అయినా ప్రభుత్వం ప్రజల నుంచి ఏదో రూపంలో ట్యాక్స్​ వసూలు చేయాలని భావించి కంట్రిబ్యూషన్​ పేరిట ఇలా వసూళ్లకు పాల్పడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయాన్ని భారం పడే అన్ని విభాగాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ జీఓ రద్దు చేసుకోనట్లయితే ఉద్యమిస్తామని పలు ఉద్యోగ, విద్యార్థి, వ్యాపార, వాణిజ్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కోసం స్వచ్ఛందంగా నిధుల సేకరణ జరగాలి కానీ.. నిర్బంధంగా జీఓలు జారీ చేసి వసూలు చేయడం సరైంది కాదని ఆయా సంఘాల నాయకులు అంటున్నారు.  
ఎవరి నుంచి ఎంతంటే? 
రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీ పెంచడానికి హరితనిధి కలెక్ట్​ చేస్తున్నట్లు సర్కారు చెప్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్​ చైర్మన్లకు ప్రతి యేటా రూ. 6 వేలు,  జడ్పీ చైర్మన్లకు రూ.1200, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్​ చైర్మన్లకు రూ.600,  వ్యాపార, వాణిజ్య సముదాయాల రెన్యువల్​కు రూ.1000, ఇంజినీరింగ్​ శాఖలు, కార్పొరేషన్​, మున్సిపల్​ వర్క్​ కాంట్రాక్టుల్లో 0.01 శాతం, గెజిటెడ్​, నాన్​ గెజిటెడ్ ​ఎంప్లాయీస్​కు రూ.300, ఎంపీటీసీ, సర్పంచ్​, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు రూ.120, రిజిస్ట్రేషన్​ ఆఫీసుల్లో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్​కు రూ.50,  విద్యార్థులు వన్​ టు టెన్త్​ రూ.10, ఇంటర్​ రూ.15, డిగ్రీ రూ.25, ఇతర ఒకేషనల్​ కోర్సులకు రూ. 100 గా నిర్ణయించి వసూలు చేయాలని డిసైడ్​ చేశారు. 
నిర్బంధ వసూళ్లు సరైంది కాదు
సర్కార్​ ఇప్పటికే చాలా రకాల ట్యాక్సుల పేరుతో ప్రజలను దోచేస్తున్నది. ఇప్పుడు ఇన్​డైరెక్ట్​గా ప్రజలపై భారాన్ని మోపడం సరైంది కాదు. ఏ ట్యాక్సు వేస్తున్నారో  ప్రజలకు తెలియకుండానే ప్రభుత్వం డైరెక్టుగా జీఓలు ఇవ్వడం ప్రజలను మోసం చేయడమే. వెంటనే ఈ వసూళ్లను ఆపాలి. లేనట్లయితే ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేసి ఉద్యమిస్తాం. –  ఎరవెల్లి ముత్యంరావు,      సీఐటీయూ జిల్లా కార్యదర్శి, పెద్దపల్లి
స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోవాలి..
విరాళాలు స్వచ్ఛందగా ఇస్తేనే తీసుకోవాలి. జీఓలు ఇచ్చి ఉద్యోగులను భయపెట్టి వసూళ్లు చేయడం సరైంది కాదు. హరితహారం మంచి కార్యక్రమమే..కానీ ఎవరితో చర్చించకుండా జీఓలు ఇవ్వడం ప్రభుత్వ నియంతృత్వాన్ని తెలియజేస్తోంది. వెంటనే జీఓపై సర్కార్​ పునరాలోచించుకోవాలి.
–  పోరెడ్డి దామోదర్​రెడ్డి, టీపీటీఎఫ్​జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి
జీఓను రద్దు చేయాలి 
విద్యార్థుల నుంచి కూడా ఫీజుల రూపంలో హరితనిధి కోసం వసూలు చేయడం సరైంది కాదు. ఇప్పటికే విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువులకు దూరమవుతున్నారు. చాలా చిన్న మొత్తమే కదా అన్పించినా, ఇప్పుడు సర్కార్​కు అవకాశం ఇస్తే విద్యార్థులపై ఇలాంటివి ఎన్నో రుద్దే చాన్స్​ ఉంటది. అందుకే సర్కార్​ వెంటనే హరితనిధి జీఓను రద్దు చేసుకోవాలి, లేదంటే ఏబీవీపీ ఆద్వర్యంలో ఆందోళనలు స్టార్ట్​ చేస్తాం. –  ఊషన అన్వేష్​, ఏబీవీపీ, స్టేట్​ కమిటీ మెంబర్