ఫారెస్ట్​ భూముల్లో చెట్లు నరికారని.. కరెంట్ బంద్​ చేసి లాఠీచార్జి

  • ఊరిపై పడి కొట్టిన 70 మంది పోలీసులు, ఫారెస్ట్​ సిబ్బంది
  • అడ్డువచ్చిన ఆడవాళ్లనూ వదల్లే 
  • తాడ్వాయి పోలీస్​స్టేషన్​కు పది మంది తరలింపు 
  • ఇద్దరు స్కూల్​ పిల్లలు కూడా?
  • ట్రాక్టర్లలో వెళ్లడానికి సిద్ధమై విరమించుకున్న గ్రామస్తులు
  • కామారెడ్డి జిల్లా ఎక్కపల్లిలో ఉద్రిక్తత

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఎక్కపల్లి శివారులోని ఫారెస్ట్ ​భూముల్లో గ్రామస్తులు చెట్లు, పొదలు నరికివేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఫారెస్ట్ ​ఆఫీసర్లు కంపార్ట్​మెంట్ ​నెంబర్​732,737లో గ్రామస్తులు చెట్లు నరికేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట ఎస్ఐలు స్పెషల్​పార్టీ పోలీసులతో పాటు కామారెడ్డి ఎఫ్​డీవో గోపాల్​రావు, సిబ్బంది సుమారు 70 మంది మధ్యాహ్నం 3 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. 

విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా ఒక్కచోట చేరారు. చెట్లు నరికిన ప్రాంతంలో పోలీసులు, ఫారెస్లు ఆఫీసర్లు సమావేశమై గ్రామస్తులను చర్చలకు పిలవాల్సిం దిగా లింగంపేట, నాగిరెడ్డిపేట ఎస్ఐలు ప్రభాకర్, రాజులను పంపించారు. అయితే, తాము చర్చలకు సిద్ధమని గ్రామస్తులు చెప్పగా, చెట్లు నరికేసిన ప్రాంతానికి వస్తే మాట్లాడుకుందామని పోలీసులు కోరారు. దీనికి గ్రామస్తులు ఒప్పుకోలేదు. గ్రామానికి సంబంధించిన వ్యవహారం కావడంతో రెండు శాఖల ఆఫీసర్లు గ్రామంలోకే వచ్చి ప్రజలందరి ముందు చర్చించాలని పట్టుబట్టారు. దీనికి పోలీసులు ససేమిరా  అన్నారు. 

దీంతో   రెండు గంటలపాటు  చూసిన గ్రామస్తులు  పోలీసులు రాకపోవడంతో ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అప్పటికి రాత్రి ఏడు గంటలు కావడంతో పోలీసులు ఇంకా చెట్లు నరికిన ప్రదేశంలోనే వేచి ఉన్నారు.  

కరెంట్ బంద్​చేసి..లాఠీచార్జి 
గ్రామస్తులు చర్చలకు రాకపోవడంతో  పోలీసులు మరో ప్లాన్ ​వేశారు. పోలీసులు ఉన్న ప్రాంతం ​గ్రామానికి అర కిలోమీటర్ ​దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లేలోపు గ్రామానికి కరెంట్​సరఫరా నిలిపివేసి పోలీసులు, ఫారెస్ట్​ సిబ్బంది ఐదు వాహనాల్లో ఉరిపై పడ్డారు. దొరికిన వాళ్లను దొరికినట్టు లాఠీలతో చికతబాదారు. యువకులను, మధ్య వయస్కులను వదిలిపెట్టలేదు. అడ్డొచ్చిన మహిళలపై కూడా ప్రతాపం చూపారు. 

మినీ బస్సులో సుమారు 10 మందిని ఎక్కించుకుని తాడ్వాయి పోలీస్​స్టేషన్​కు తీసుకువెళ్లారు. ఇందులో స్కూల్​కు వెళ్లే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. దీంతో ఊర్లో మిగిలిన గ్రామస్తులు ట్రాక్టర్లలో పోలీస్​స్టేషన్​కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. బాగా రాత్రి కావడంతో ఆగిపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

గ్రామస్తులేమంటున్నారంటే...
గ్రామ శివారులోని ఫారెస్టు భూములను భూమి లేని  బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు సాగు చేస్తే 2016లో ఫారెస్టు ఆఫీసర్లు  కేసులు పెట్టి జరిమానాలు విధించారని, ఇప్పుడు ఆఫీసర్లు కేవలం ఎస్టీలకు మాత్రమే పోడు పట్టాలు ఎలా ఇస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. బీసీలకు పట్టాలు ఇవ్వకపోయినా సాగు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 

ఎస్టీలు సాగులో లేకపోయినా ఫారెస్టు, రెవెన్యూ ఆఫీసర్లు  పోడు పట్టాలను ఇచ్చారని, పోడు పట్టాల సర్వేలో ఫారెస్టు ఆఫీసర్లు ఆర్డీఓకు ఇచ్చిన ధ్రువపత్రాలను చూపాలని డిమాండ్​ చేశారు. దీనిపై డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీలు ఫారెస్టు భూములను సాగుచేసుకునేందుకు చట్టంలో ఎలాంటి అధికారాలు లేవని, కావాలంటే అధికారులకు విన్నవించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉండేదన్నారు. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలని, లేకపోతే చర్యలు తప్పవన్నారు.