- క్వింటాల్ రూ.2 వేల కంటే తక్కువే
- గ్రామాల్లో మిల్లర్ల కొనుగోలు
- కాంటా, హమాలీ, ట్రాన్స్‌పోర్టు ఖర్చు రైతుదే
- క్వింటాల్ కు 2 కిలోలు కటింగ్
యాదాద్రి, వెలుగు : వరి కోతలు ఇప్పుడిప్పుడే ఊపందుకొని కల్లాల్లోకి వడ్ల కుప్పలు చేరుతున్నాయి. సివిల్‌సప్లయ్ కొనుగోళ్లు ఇంకా ఊపందుకోలేదు. మిల్లర్ల తరపున కొనడానికి దళారులు అప్పుడే రంగంలోకి దిగారు. సర్కారు నిర్ణయించిన రేటు కంటే అగ్గువకే కొనేస్తున్నారు. పైగా ఖర్చులు భారం కూడా రైతు మీదే వేస్తున్నారు.యాదాద్రి జిల్లాలో 6 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఈ వానాకాలం సీజన్లో మొత్తం 4.10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేశారు.
ఇందులో 2.85 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తుండగా, 1.05 లక్షల ఎకరాల్లో పత్తిని పండించారు. మిగిలిన ఎకరాల్లో వివిధ రకాలు పంటలు పడించారు. ఈ సీజన్లో సుమారు 6 లక్షల టన్నులు వడ్ల దిగుబడి వస్తుందని, అందులోంచి 4 లక్షల టన్నులు కొనుగోలు సెంటర్లకు వస్తాయని ఆఫీసర్లు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా 369 కొనుగోలు సెంటర్ల ఏర్పాటుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు దాదాపు 160 సెంటర్లను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఖర్చులన్నీ రైతువే.. అగ్గువకే కొనుగోళ్లు..
కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రస్తుతం రూ.2,300 నుంచి రూ.2,320 ఉంది. నిబంధనల ప్రకారం వడ్లు పూర్తిగా ఆరిన తర్వాతే కొనుగోలు చేస్తారు. అయితే రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న దళారులు మిల్లర్ల తరఫున రంగ ప్రవేశం చేశారు. నేరుగా రైతులతో మాట్లాడి వడ్లకు క్వింటాల్‌కు రూ.1900 నుంచి రూ.1950 వరకు ఇస్తామని చెబుతున్నారు. అయితే పొలం వద్ద వడ్లను బస్తాల్లో నింపడానికి 60 కిలోల బస్తాకు హమాలీ చార్జీ రూ.25 నుంచి రూ.30 ఖర్చు అవుతోంది. అక్కడి నుంచి వే బ్రిడ్జి వరకు తీసుకెళ్లడానికి ట్రాన్స్‌పోర్టు రైతులే ఏర్పాటు చేసుకుంటున్నారు. వే బ్రిడ్జి వద్ద తూకం వేసిన తర్వాత చార్జీ రైతులే చెల్లిస్తున్నారు.
తూకం వేసిన తర్వాత క్వింటాల్‌కు 2 కిలోలు కోత విధిస్తున్నారు. దీంతోపాటు పూర్తి బిల్లులో 2 శాతం కమీషన్ కట్చేసుకుంటున్నారు. తూకం వేసిన తర్వాత వారం నుంచి పది రోజుల్లో రైతులకు వడ్ల పైసలు ఇస్తున్నారు. ధర తక్కువ వల్ల నష్టం కలుగుతున్నా సెంటర్లలో వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా.. వడ్లు ఎలా ఉన్నా దళారులు కొనుగోలు చేస్తుండడంతో రైతులు అమ్ముకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
ఆకాశంలో మబ్బులు..
గడిచిన కొన్ని రోజులుగా తరచూ ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. అక్కడక్కడా వానలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల తడారకపోవడంతో మిషన్లు పొలాల్లోకి వెళ్తే దిగబడుతాయని కోతలు కోయడం లేదు. మోత్కూరు, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్తదితర ప్రాంతాల్లో వరి కోతలు కొనసాగుతున్నాయి. కొనుగోలు సెంటర్లకు వడ్లు వస్తున్నాయి. మరికొందరు వడ్లను కల్లాల వద్దే ఆరబెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో ఆకాశంలో తరచూ మబ్బులు కమ్ముకోవడంతో ఇన్నాళ్ల కష్టం వృథా అవుతుందేమోనని రైతులు భయపడుతున్నారు.