ముంబై కేంద్రంగా హైదరాబాద్‌కి డ్రగ్స్ సప్లై చేస్తున్నారని సీపీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ దందా చేస్తున్న మూడు గ్యాంగ్‌లకు చెందిన వ్యక్తులను అరెస్టు చేశామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్లు చేశామన్నారు. సనా ఖాన్ అనే యువతి ద్వారా డ్రగ్స్ చైన్‌ను పట్టుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌కి చెందిన 40మంది, ముంబైలో 70 మంది స్నేహితులకు సనా ఖాన్ డ్రగ్స్ అమ్మకాలు చేస్తోందని అన్నారు. ఈమెకు సహకరిస్తున్న మరికొందరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి వద్ద నుండి 204 గ్రాముల ఎండీఎంఏ, ఒక బైకును స్వాధీనం చేసుకున్నామని సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఏపీ నుండి ముంబైకి గంజాయి తరలిస్తుండగా మరో గ్యాంగ్‌ని పట్టుకున్నామని సీవీ ఆనంద్ చెప్పారు. ఈ కేసులో భార్య, భర్తలు ఇద్దరూ పరారయ్యారని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇక మూడో గ్యాంగ్‌ని కూడా పట్టుకున్నట్లు సీవీ ఆనంద్ చెప్పారు. ఇక గత ఏడాదిగా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ద్వారా 104 కేసులు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు 6.3 కోట్లు విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 202 డ్రగ్స్ ఫెడ్లర్లను అరెస్టు చేశామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.