
సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్‌కు చెందిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తన వాటాను విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు మూడు సీజన్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ మెజారిటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్‌లు ఈ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ అనే ఫ్రాంచైజీ కలిగి ఉంది. గతంలో ఐపీఎల్ జట్లను కొనుగోలు చేస్తామని ఆఫర్ చేసినా బిడ్డింగ్ లో ఫెయిలైంది. తాజాగా గుజరాత్ టైటాన్స్ జట్టు తన షేర్లను విక్రయిస్తున్నందున అదానీ గ్రూప్ ఐపీఎల్‌లోకి ప్రవేశించే అవకాశం ఎంతైనా ఉంది.
కాగా 2021లో CVC క్యాపిటల్ పార్టనర్స్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీని రూ. 5625 కోట్లకు కొనుగోలు చేసింది. మూడేళ్ల తర్వాత తన జట్టు మెజారిటీని సీవీసీ అమ్మేయాలని నిర్ణయించుకుంది. ఐతే ఇప్పటికే అదానీ గ్రూప్, టోరెంట్ గ్రూప్ డీల్ క్లోజ్ చేయడానికి CVC క్యాపిటల్ పార్ట్‌నర్స్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
అదానీ గ్రూప్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తే జట్టు పేరు మారే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ మహిళల ప్రీమియర్ లీగ్, లెజెండ్స్ క్రికెట్ లీగ్, ప్రో కబడ్డీ లీగ్, అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లలో గుజరాత్ జెయింట్స్ పేరుతో జట్లను కలిగి ఉంది. కాబట్టి గుజరాత్ టైటాన్స్ అదానీగా మారితే ఆ జట్టు పేరు గుజరాత్ జెయింట్స్ గా మారచ్చని బిజినెస్ విశ్లేషకులు చెప్తున్నారు.