ODI World Cup 2023: ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దారు: ఆఫ్ఘనిస్తాన్ విజయాల వెనుక ఇద్దరు వ్యూహకర్తలు

ఆఫ్గనిస్తాన్ చేతిలో పాకిస్తాన్ ఓటమి.. క్రికెట్ ప్రపంచమంతా ఇప్పుడు దీనిపైనే చర్చ. ఆఫ్ఘన్లు బాగా ఆడారు.. గెలిచారు అందులో ఏముంది అనుకోవచ్చు. కానీ వారు పడిన శ్రమ ఏంటి..? వారి గెలుపు వెనుకున్న కష్టాల కన్నీళ్లు ఏంటి..? అనేది ఆలోచించాలి. అసలు అఫ్గన్‌ ఆటగాళ్లు ఏ స్థితిలో ప్రపంచకప్‌లో అడుగు పెట్టారో తెలిస్తే.. ఆ జట్టు మీద అభిమానం మరింత పెరుగుతుంది. 

తాలిబన్ల పాలనలో అఫ్గన్‌ ప్రజలు పడుతున్న కష్టాలను వారు తలుచుకోని రోజంటూ ఉండదు. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాక అఫ్గన్‌ ప్రజల పరిస్థితి దయనీయంగా మారడమే కాదు.. ఆర్థికంగానూ చితికిపోయారు. అక్కడ ఉండి బ్రతకలేరు.. మరో దేశానికి వలస వెళ్ళలేరు. మరోవైపు భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన ఓ భూకంపం ధాటికి ఏకంగా 3వేల మందికి పైగా మరణించారు. ఇన్ని కష్టాలను దిగమింగుకొని.. వారు ఇంగ్లాండ్, పాకిస్తాన్ వంటి మేటిజట్లను ఓడించిన తీరు ఓ అద్భుతం. ఎంతో కసి ఉంటే కానీ... ఇలాంటి విజయాలు రావు. 

ALSO READ :- పండగ పూట.. ఎగ్ కర్రీ వండలేదని చంపేశాడు

ఆఫ్ఘన్ విజయం వెనుక జడేజా, ట్రాట్

ఈ టోర్నీలో ఆఫ్గనిస్తాన్ విజయాలు గాలివాటం కాదు.. వారి ఆటలో పరిణితి ఉంది.. ఆ జట్టు ఆటగాళ్ల కళ్లలో గెలవాలన్న కసి కనిపిస్తోంది. ఆ పట్టుదల, దృఢసంకల్పమే వారికి విజయాలు తెచ్చిపెడుతోంది. మరి వీటి వెనుకున్న వ్యూహకర్తలు ఎవరో తెలుసా..? ఒకరు భారత మాజీ కెప్టెన్ అజయ్ జడేజా, మరొకరు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్. 

జోనాథన్ ట్రాట్ ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన కోచ్‌గా భాద్యతలు చేపట్టాక ఆ జట్టు ఆటగాళ్లలో ఎంతో పరిణితి కనిపిస్తోంది. వారి ఆడే విధానంలో చాలా మార్పొచ్చింది. చాలా భాద్యతాయుతంగా ఆడుతున్నారు. పేసర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇక ఆ జట్టు మెంటార్‌గా అజయ్ జడేజా బాధ్యతలు చేపట్టాక వారిని మరింత మెరికల్లా తీర్చిదిద్దారు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌ను సృష్టించగలిగారు. 282 పరుగుల స్కోరును ఆఫ్ఘన్.. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించిందంటే వారి బ్యాటింగ్ ఆర్డర్ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విజయాలు ఆ జట్టు మరిన్ని సాధించాలని మనమూ ఆశిద్దాం..