Cricket World Cup 2023: పాకిస్తాన్‌పై ఎలాగూ రాణిస్తా.. ముందు మా అమ్మను కలవాలి: బుమ్రా

Cricket World Cup 2023: పాకిస్తాన్‌పై ఎలాగూ రాణిస్తా.. ముందు మా అమ్మను కలవాలి: బుమ్రా

గాయం నుంచి తిరిగొచ్చాక భార‌త పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనపరుస్తున్నాడు. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సత్తా చాటుతున్నాడు. చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన బుమ్రా.. ఆఫ్గనిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అక్టోబర్ 14న జరగనున్న దాయాదుల(ఇండియా- పాకిస్తాన్) పోరులో అతనిపై ఆశలు మరింత ఎక్కువయ్యాయి.

ఇదిలావుంటే, పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు బుమ్రా తన కుటుంబసభ్యులను కలవనున్నాడు. అతని స్వస్థలం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ కూడా అదే నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో కనుక ముందుగా కుటుంబసభ్యులతో ముచ్చటించనున్నాడు. చాలారోజులుగా కుటుంబానికి దూరంగా ఉన్నానన్న బుమ్రా.. తన తల్లిని ఇంటికెళ్లి పలకరించడంలో ఉండే ఆనందమే వేరని చెప్పుకొచ్చారు. 

ALSO READ: Cricket World Cup 2023: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్లు.. ఆల్‍టైం సెంచరీల్లో తొలి మూడు స్థానాలు మనవే

"నేను కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు నా వాళ్లను కలిసే అవకాశమొచ్చింది. ఇంట్లో మా అమ్మను చూస్తే నేను మరింత సంతోషంగా ఉంటాను. పాకిస్థాన్‌తో తలపడటం కంటే ముందు తల్లిని కలవడమే నా మొదటి ప్రాధాన్యత. నేను ఈ వేదికపై వన్డేలు ఆడలేదు. ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రం ఆడాను. ఎక్కువ మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు. వాతావరణం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. నేను నా వరకు అత్యుత్తమంగా రాణించడానికే ప్రయత్నిస్తాను.." అని జస్ప్రీత్ బుమ్రా వెల్లడించాడు.

అక్టోబర్ 14న ఇండియా - పాక్ మ్యాచ్

ప్రపంచ కప్‌లో భాగంగా ఈ నెల 14న భారత జట్టు పాకిస్థాన్‌తో జరుగునున్న విషయం తెలిసిందే. ఈ  మ్యాచ్ లో భారత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం గిల్‌ డెంగ్యూ బారిన పడగా.. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడు. అయితే, పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌కు ముందు ఫిట్‌నెస్‌నిరూపించుకోవాల్సి ఉంది. ఈ ఏడాది గిల్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 20 ఇన్నింగ్స్‌ల్లో 1,230 పరుగులు చేయగా.. సగటు 72.35, స్ట్రైక్ రేట్ 105.03 ఉంది.