మేం ఆడే రోజుల్లో పాక్ జట్టు వేరేలా ఉండేది.. వీళ్లంతా పేపర్ ప్లేయర్లు: సౌరవ్ గంగూలీ

మేం ఆడే రోజుల్లో పాక్ జట్టు వేరేలా ఉండేది.. వీళ్లంతా పేపర్ ప్లేయర్లు: సౌరవ్ గంగూలీ

వన్డే ప్రపంచ కప్‌లో దాయాది పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా.. భారత్ తో జరిగిన మ్యాచ్‌లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. వేలకు వేలు వెచ్చించి స్టేడియానికి వెళ్లిన అభిమానులు కూడా ఈ మ్యాచ్ పట్ల ఎంతో నిరాశచెందారు. తాజాగా పాకిస్తాన్ జట్టు ప్రదర్శన పట్ల భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాము ఆడే రోజుల్లో పాకిస్తాన్ జట్టు వేరేలా ఉండేదన్న గంగూలీ.. బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టుకు ఒత్తిడిని తట్టుకునే సత్తా లేదని అభిప్రాయపడ్డారు. "మా కాలంలో పాకిస్తాన్ ఇలా ఉండేది కాదు. అది పూర్తిగా డిఫరెంట్. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పటిష్టంగా ఉండేది. ఒత్తిడిని కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడున్న పాకిస్తాన్ టీమ్ అలా కనిపించడం లేదు. పేపర్ మీద మాత్రమే పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి ప్రదర్శనతో వరల్డ్ కప్‌‌లో నెట్టుకురావడం చాలా కష్టం.." అని గంగూలీ వెల్లడించారు.

152/2.. 191 ఆలౌట్ 

29 ఓవర్ల వద్ద పాకిస్థాన్  జట్టు 155/2తో పటిష్టంగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత ఉన్నట్టుండి 191 పరుగులకే కుప్పకూలారు. బాబర్ అజామ్ (50), మహ్మద్ రిజ్వాన్ (49), ఇమామ్ ఉల్ హక్ (36), అబ్దుల్లా షఫీక్ (20) మినహా మిగతా ఆటగాళ్లు ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు  కనబరచలేదు. సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్‌లతో కూడిన పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఈ విజయంతో భారత జట్టు.. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్ వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది.

ఆస్ట్రేలియాతో ఢీ:

పాకిస్తాన్ జట్టు తదుపరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది.