బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వీర విహారం చేసిన సంగతి తెలిసిందే. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ( మొత్తంగా 106 పరుగులు) బాదిన ఈ విధ్వంసకర క్రికెటర్.. ప్రపంచ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. పోనీ, ఈ ఘనత సాధించాకైనా అతడు సంతోషంగా ఉన్నాడా! అంటే అదీ లేదు. బీసీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
లైట్ షో వెలుగులు
ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం బీసీసీఐ స్టేడియాల్లో లైట్ షో ఏర్పాటు చేసింది. అందులో భాగంగా వచ్చే మిరుమిట్లు గొలిపే వెలుగులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కాంతులను ఫ్యాన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నా.. ఆటగాళ్లు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారట. నెదర్లాండ్స్ మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై మాట్లాడిన మ్యాక్స్‌వెల్.. ఈ ఆలోచనే ఒక చెత్త నిర్ణయం అని చెప్పుకొచ్చాడు.
"బిగ్ బ్యాష్ లీగ్‌లో ఒకసారి పెర్త్‌లో ఇలానే లైట్ షో ఏర్పాటు చేశారు. అప్పుడు నాకు బాగా తలనొప్పి వచ్చేసింది. ఒకసారి లైట్ షో ముగిశాక.. ఆ కాంతుల నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతోంది. వెంటనే కళ్లు అడ్జస్ట్ అవ్వట్లేదు. ఫ్యాన్స్‌కు ఇది బాగానే ఉండొచ్చు.. కానీ ప్లేయర్లకు మాత్రం నరకంలా అనిపిస్తోంది. అందుకే వీలైనంతవరకూ కళ్లు మూసుకుంటున్నా. నిజంగా ఇదొక భయంకరమైన ఐడియా. నా వరకూ క్రికెటర్ల విషయంలో ఇంత కన్నా చెత్త నిర్ణయం మరొకటి లేదనుకుంటా.. ' అని మ్యాక్స్‌వెల్ తెలిపాడు.
Arun Jaitley Stadium today's match lights show ?. #AUSvsNED pic.twitter.com/9hUutVNm93
— Sports Addict (AJ) (@AJpadhi) October 25, 2023
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగుల భారీ స్కోరు చేయగా..లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 90 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ ప్రపంచ కప్ చరిత్రలోనే పరుగుల(309 పరుగులు) పరంగా అతి పెద్ద విజయాన్ని అందుకుంది.