దాయాది పాకిస్తాన్ జట్టును అదృష్టం.. దురదృష్టంలా వెంటాడుతోంది. కాకపోతే తొలి 6 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడిన పాక్ సెమీస్ రేసులో ఉండడమేంటి! ఇప్పుడు ఏకంగా సెమీస్ చేరేలా కనిపించడమేంటి! అవును మీరు చదివింది నిజమే. వన్డే ప్రపంచ కప్ 2023లో పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. అందుకు కారణం.. వర్షం. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 400పైచిలుకు పరుగులు లక్ష్య ఛేదనలో వారికి సహాయపడ్డ వరుణుడు, ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు.
గురువారం(నవంబర్ 9) బెంగుళూరు, చిన్నస్వామి వేదికగా న్యూజిలాండ్.. శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో కివీస్ విజయం సాధిస్తే నాలుగో బెర్త్ రేసులో ఇంకాస్త ముందుకు సాగొచ్చు. అప్పుడు ఖాతాలో 10 పాయింట్లు, నెట్‌రన్‌రేట్ కూడా మెరుగుపడుతుంది కనుక సెమీస్ అవకాశాలు మెండుగా ఉంటాయి. కాకుంటే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడుతున్నారు.
ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం గురువారం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో 90% వర్షం పడే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పలుమార్లు అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ జట్లలో ఒకరు సెమీస్ చేరొచ్చు. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం..
NZ practice session got interrupted by a DRIZZLE at Chinnaswamy Stadium. Heavy rain forecast for tomorrow, on match day. If this happens then PAK win over ENG will make PAK to semis. #NZvsSL pic.twitter.com/VNyljiEOli
— Tim Bhau (@Tim_Bhau) November 8, 2023
న్యూజిలాండ్ 9.. పాకిస్తాన్ 10, ఆఫ్గనిస్తాన్ 10
శ్రీలంకతో మ్యాచ్ రద్దయితే అయితే న్యూజిలాండ్ ఖాతాలో ఒక పాయింట్ మాత్రమే చేరుతుంది. అప్పుడు కివీస్ వద్ద 9 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో పాక్ (8), అఫ్గాన్ (8) తమ చివరి మ్యాచుల్లో గెలిస్తే వారి ఖాతాలో 10 పాయింట్లు ఉంటాయి. అప్పుడు ఈ రెండింటిలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది. ప్రస్తుతానికి అఫ్గాన్ జట్టు నెట్‌రన్‌రేట్ మైనస్(--- -0.338)లలో ఉంది. వారు తమ చివరి మ్యాచ్ లో గెలిచినా పాక్(+0.036)ను కిందకు నెట్టడం అనేది అసంభవం. అదే జరిగితే పాక్ సెమీస్ చేరుతుంది. అలా కాకుండా ఈ రెండూ ఓడితే మాత్రం న్యూజిలాండే మన ప్రత్యర్థి.
అఫ్గాన్ జట్టు.. తమ చివరి మ్యాచులో సౌతాఫ్రికాతో తలపడనుండగా, పాకిస్తాన్.. ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది.
కాగా, ప్రస్తుతానికి భారత్(16 పాయింట్లు), దక్షిణాఫ్రికా(12 పాయింట్లు), ఆస్ట్రేలియా(12 పాయింట్లు) జట్లు సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. సెమీఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియాతో తలపడనుండగా, భారత్ ప్రత్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది.