వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం అహ్మాదాబాద్ వేదికగా హైవోల్టేజ్ మ్యాచ్ జరగనున్నవిషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థులు ఇండియా- పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇప్పటివరకూ జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లలో భారత్ పై ఒక్క విజయం అందుకోని పాకిస్తాన్ జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలవబోతోందని ఆ జట్టు మాజీ పేసర్ షోయాబ్ అక్తర్ జోస్యం చెప్పాడు.
ఇండియాదే పైచేయి
ఇప్పటివరకూ ఇరు జట్లు వరల్డ్ కప్ మ్యాచ్‌లలో 7 సార్లు తలపడగా అన్నింటా ఇండియానే విజయం సాధించింది. తొలిసారి 1992 ప్రపంచ కప్ లో సిడ్నీ గడ్డపై 43 పరుగుల తేడాతో పాక్ ను చిత్తుచేసిన భారత్, చివరిసారి 2019లో మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 89 పరుగుల తేడాతో (డిఎల్‌ఎస్ పద్ధతి) విజయం సాధించింది. అయినప్పటికీ, ఆ జట్టు ఆటగాళ్లలో, మాజీ క్రికెటర్లకు బుద్ధి రావడం లేదు. గెలిచాక పలకాల్సిన మాటలను.. మ్యాచ్ కు ముందు చెప్తున్నారు. గెలవబోయేది తామేనంటూ గంభీరాలు పలుకుతున్నారు. ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో గెలిచేది తమ జట్టే అని.. తద్వారా చరిత్రను తిరగరాయబోతున్నాం.. అని అక్తర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
అక్తర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు నెట్టింట ట్రోలింగ్ మొదలుపెట్టారు. మీ వాళ్లు గెలవరు.. చరిత్ర మారదు.. అన్న కామెంట్లు పెడుతున్నారు.