- తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని అప్పటి సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారు
- కాళేశ్వరం కమిషన్‌కు వివరించిన కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్
- వివరించిన కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్
- బ్యారేజీల లొకేషన్ల మార్పుపై నిర్ణయం కూడా కేసీఆర్‌దే
- రాజకీయ కారణాలతో మేడిగడ్డకు లొకేషన్ మార్చి ఉండొచ్చు
- ఇన్వెస్టిగేషన్ స్టడీస్, డిజైన్స్, మోడల్స్‌పై ఓ పద్ధతి ఫాలో కాలేదు
- సరైన ఓఅండ్ఎం లేకపోవడమూ బ్యారేజీలు కుంగడానికి ఓ కారణం
- మేడిగడ్డలాగే మిగతా రెండు బ్యారేజీలు కుంగిపోవచ్చని వ్యాఖ్య
- కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో నాకు సంబంధం లేదు: స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతుల్లేవని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) సీఈ ఇచ్చిన డిజైన్లకు ఆమోదం రాలేదని తెలిపారు. శుక్రవారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణకు వెదిరె శ్రీరామ్ హాజరయ్యారు. ‘‘ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చింది ఎవరు? దానిపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నది ఎవరు?’’ అని కమిషన్ ప్రశ్నించింది.
అప్పటి సీఎం బ్యారేజీ లొకేషన్‌ను మార్చారని శ్రీరామ్ చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే బ్యారేజీ సైట్‌ను మార్చామని అప్పటి సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. వాస్తవానికి 75% డిపెండబిలిటీ (ఓ వాటర్ ఇయర్లో వచ్చే సగటు వరద) ఆధారంగా 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందంటూ 2015లో సీడబ్ల్యూసీ చెప్పిందని, కానీ, సైట్ మార్చాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఆ నెపాన్ని సీడబ్ల్యూసీపైకి నెట్టిందని పేర్కొన్నారు.
దాంతోపాటు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రవైపు 4,200 ఎకరాల భూమి ముంపునకు గురవుతున్నదని, అందుకే ప్రాజెక్ట్ సైట్‌ను మారుస్తున్నామని చెప్పడం అర్థరహితమని వెల్లడించారు. ప్రాజెక్ట్ సైట్ మార్చడం వెనుక రాజకీయ కారణాలు లేదా ఏవైనా ఉండి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
కడుతున్నప్పుడూ డిజైన్ల మార్పు
మేడిగడ్డ బ్యారేజీలో లోపాలేంటి? అని వెదిరె శ్రీరామ్‌ను కమిషన్ ప్రశ్నించింది. ఏ ప్రాజెక్టుకైనా కనీస టెస్టులు చేయాల్సి ఉంటుందని, కానీ, 3 బ్యారేజీల విషయంలో వాటిని సరిగ్గా ఫాలో కాలేదని వెదిరె శ్రీరామ్ చెప్పారు. ఇన్వెస్టిగేషన్ స్టడీస్, డిజైన్స్, మోడల్స్‌పై ఓ పద్ధతి ఫాలో కాలేదని వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణ సమయంలోనూ డిజైన్లు పదే పదే మార్చారని వివరించారు.
Also Read :- భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఓ క్రమ పద్ధతి లేకుండా నిర్మాణం చేయడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని తెలిపారు. బ్యారేజీ నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్‌ను కూడా పట్టించుకోలేదని తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, భవిష్యత్తులో ఈ బ్యారేజీలకూ ప్రమాదమే పొంచి ఉందని చెప్పారు.
ఓ అండ్ ఎంపై నిధులు ఖర్చు చేయలే..
బ్యారేజీలను ప్రారంభించాక వాటి పరిరక్షణకు కనీస చర్యలు చేపట్టలేదని వెదిరె శ్రీరామ్ చెప్పారు. బ్యారేజీల్లో 2019లో తొలిసారి సమస్యలను గుర్తించినప్పుడు ఏజెన్సీలకు ఓ అండ్ఎంకు సంబంధించిన అంశాల గురించి చెప్పినా చర్యలు మాత్రం తీసుకోలేదని స్పష్టం చేశారు. సరైన టెస్టులు చేయకుండానే సీడీవో డిపార్ట్మెంట్ బ్యారేజీల డిజైన్లను ఇచ్చిందని తెలిపారు.
మేడిగడ్డ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు రావడం వంటి ఘటనలు జరిగాక.. ఎన్డీఎస్ఏ చేసిన సూచనలను పాటించడంలో ఓ అండ్ఎం ఈఎన్సీ నిర్లక్ష్యం చేశారా? అని కమిషన్ ప్రశ్నించింది. సమస్య తలెత్తగానే ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బ్యారేజీలను పరిశీలించిందని, 20 రకాల పరీక్షలు చేయాల్సిందిగా సూచించిందని శ్రీరామ్ చెప్పారు. ఆ టెస్టులు చేయడంలో ఓ అండ్ ఎం విభాగం చాలా ఆలస్యం చేసిందన్నారు.
రుణాల సమీకరణకే కార్పొరేషన్లా ఉంది
రుణ సమీకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పా టు చేసినట్టు కనిపిస్తున్నదని వెదిరె శ్రీరామ్ అన్నారు. కార్పొరేట్ బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు లోన్లు తీసుకున్నారని, అయితే, ప్రాజెక్ట్ నుంచి వస్తున్న ఫలాలు మాత్రం శూన్యమని తెలిపారు. కాగా, వెదిరె శ్రీరామ్ తన అఫిడవిట్లో పేర్కొన్న సీడబ్ల్యూసీ నుంచి తీసుకున్న సీఈ సీడీవో లెటర్‌కు, అధికారులు ఇచ్చిన లేఖకు తేడా ఉండడంతో ఇదేంటని కమిషన్ ప్రశ్నించింది.
తాను ఆ లెటర్‌ను నేరుగా సీడబ్ల్యూసీ నుంచే తీసుకున్నానని, తేడాలు ఎందుకున్నాయో తెలియదని వెదిరె శ్రీరామ్ బదులిచ్చారు. సీడబ్ల్యూసీకి లెటర్/నోటీస్ ఇచ్చాకే ఆ లెటర్‌ను పొందారా? అని కమిషన్ ప్రశ్నించింది. తాను జలశక్తి సలహాదారుగా పనిచేస్తున్నానని, కాళేశ్వరానికి సంబంధించిన పలు మీటింగ్స్‌లో పాల్గొన్నానని, ఆ హోదాలోనే సీడబ్ల్యూసీ నుంచి లేఖ తీసుకున్నానని చెప్పారు. కాగా, కమిషన్ ముందు ఎమ్మెల్సీ కోదండరామ్ హాజరయ్యా రు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌పై కమిషన్ అస హనం వ్యక్తంచేసింది. అసలు అది అఫిడవిట్టేనా? అని ప్రశ్నించింది. కోదండరామ్ తర్వాత.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ (గతంలో 2016 నుంచి 2019 వరకు మైనర్ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ) ఓపెన్ కోర్టుకు వచ్చారు.
ఆత్రం వల్లే నష్టం
బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశం లేదని, కేవలం డైవర్ట్ చేసే స్ట్రక్చర్లేనని వెదిరె శ్రీరామ్ చెప్పారు. బ్యారేజీల ప్లాన్లను రూపొందించడానికి ముందే నిర్మాణం ప్రారంభమైందా? లేదా టెండర్లు పిలిచి పనులు అప్పగించారా? అని కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణం ప్రారంభమవడానికి ముందే 2016లో అప్పటి సీఎం దానిపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారని శ్రీరామ్ చెప్పారు. 2019లోపే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టారన్నారు. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా తక్కువ టైంలో బ్యారేజీలను పూర్తి చేయాలన్న ఆత్రంలో నిర్మాణాలు చేయడం వల్ల బ్యారేజీలకు నష్టం జరిగిందని తేల్చి చెప్పారు.